Kuldeep yadav: అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్‌దీప్‌

దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్‌ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్‌దీప్‌ కీలక పాత్ర పోషించాడు.

Updated : 08 May 2024 13:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో దిల్లీ ఆరో విజయాన్ని నమోదు చేసింది. బలమైన రాజస్థాన్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. సంజూ సేనను ఓడించడంలో కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి కీలకమైన రెండు వికెట్లను పడగొట్టాడు. అతడినే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఈ సీజన్‌లో కుల్‌దీప్‌ కొన్ని బంతులను మీడియం పేసర్‌ వేసిన వేగంతో సంధిస్తూ బ్యాటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. తాజాగా రాజస్థాన్‌పైనా ఇలానే బౌలింగ్‌ వేశాడు. ఒక దశలో 110 కి.మీ వేగంతోనూ బంతులేయడ గమనార్హం. మ్యాచ్‌ అనంతరం తన బౌలింగ్‌ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మంచి లెంగ్త్‌తో బంతులేయడం చాలా కీలకం. మరీ ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అసలైన సవాల్‌ ఎదురవుతుంది. దక్షిణాఫ్రికాలో ఫెరీరాను ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఎక్కువగా బ్యాక్‌ఫుట్ వాడతాడు. దీంతో కాస్త వేగంగా బంతిని వేస్తే ఫలితం ఉంటుందని తెలుసు. అతడు క్రీజ్‌లోకి వచ్చాక నా తొలి బంతిని వికెట్ల మీదకు విసిరా. సరిగ్గా దొరికిపోయాడు. కొన్నిసార్లు నేను ఎక్కువ సీమ్‌తో కూడిన బంతులను వేస్తున్నా. బ్యాటర్లు ఎలా ఆడుతున్నారనే దానిని అర్థం చేసుకుని.. అందుకు తగ్గట్టుగా బౌలింగ్‌ చేస్తున్నా. మేం 200+ స్కోరు చేసినా.. మా బౌలర్లపై ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వికెట్లను తీయాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని కుల్‌దీప్‌ తెలిపాడు. 

కుల్‌దీప్‌ వల్లే..: పంత్

‘‘మా బౌలర్లు ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేశారు. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాం. ప్రతి మ్యాచ్‌ నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. మేం గెలిచినా.. ఓడినా మా ప్లాన్స్‌ను ఇంకా మెరుగుపర్చుకుంటూ తదుపరి మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతాం. కుల్‌దీప్‌ బౌలింగ్‌ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ అతడి ప్రభావం సుస్పష్టం’’ అని దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్‌ వ్యాఖ్యానించాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఐపీఎల్‌లో దిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అక్షర్ పటేల్ (61) నిలిచాడు. రాజస్థాన్‌పై ఒక వికెట్ తీసిన అతడు.. నోకియా (60)ను అధిగమించాడు. అందరికంటే ముందు అమిత్ మిశ్రా (106) ఉన్నాడు.
  • రాజస్థాన్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ రెండో అత్యుత్తమ స్కోరు ఇదే. దిల్లీపై ఇప్పుడు 86 పరుగులు చేశాడు. గతంలో పంజాబ్‌పై (2021) సంజూ 119 పరుగులతో రాణించాడు. 
  • ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ స్కోర్లు ఎక్కువ స్కోర్లు నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ ఎడిషన్‌లో 13 సార్లు చోటు చేసుకుంది. గతేడాది (12) రికార్డును అధిగమించింది. 
  • ఐపీఎల్‌లో దిల్లీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పీయూశ్‌ చావ్లా (27)తో కలిసి అశ్విన్‌ (27) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత బుమ్రా (26), హర్భజన్‌ (24), సునీల్ నరైన్ (24) ఉన్నారు. 
  • టీ20 క్రికెట్‌లో 350+ వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలోకి యుజ్వేంద్ర చాహల్‌ వచ్చాడు. దిల్లీపై ఒక్క వికెట్‌ తీసిన అతడు 350వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ లిస్ట్‌లో రషీద్ ఖాన్ (572), సునీల్ నరైన్ (549), ఇమ్రాన్ తాహిర్ (502), షకిబ్ (482) ముందున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని