Gujarat: గుజరాత్ ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా

గుజరాత్‌(Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. కొందరు విజయం సాధించగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు.

Updated : 08 Dec 2022 19:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గుజరాత్‌(Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) కాషాయ జెండా మళ్లీ రెపరెపలాడింది. గతంలో ఎన్నడూ లేనంతగా అఖండ మెజార్టీతో భాజపా ఘన విజయం సాధించింది. కాగా.. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేశారు. కొందరు అంచనాలకు తగ్గట్లుగానే జయకేతనం ఎగురవేయగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల ఫలితాలు ఇలా ఉన్నాయి..

* గుజరాత్‌ ముఖ్యమంత్రి, భాజపా నేత భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా స్థానం నుంచి 2.13లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. పటేల్‌ ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థికి కేవలం 21వేల ఓట్లు మాత్రమే దక్కాయి.

* ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ కంభాలియా నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి ములు బేరాకు 77వేల ఓట్లు రాగా.. గఢ్వీకి 58వేల ఓట్లు పోలయ్యాయి.

* పాటీదార్‌ నేత, భాజపా అభ్యర్థి హార్దిక్‌ పటేల్‌ విరంగమ్‌ నుంచి విజయం సాధించారు. తన సమీప ఆమ్‌ ఆద్మీ అభ్యర్థి అమర్‌సిన్హ్‌ ఠాకోర్‌పై 51వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

*  వాద్గామ్‌ నుంచి పోటీ చేసిన దళిత యువ నేత, కాంగ్రెస్‌ అభ్యర్థి జిగ్నేశ్ మేవానీ  4928 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ ఆయనకు మొత్తంగా 94,765 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి మణిభాయ్‌ వాఘేలాకు 89,837 ఓట్లు వచ్చాయి. 

* ఓబీసీ నేత, భాజపా అభ్యర్థి అల్పేశ్‌ ఠాకూర్‌ గాంధీనగర్‌ (సౌత్‌) నియోజకవర్గం నుంచి 36వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

* క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి, భాజపా అభ్యర్థి రీవాబా జడేజా జామ్‌నగర్‌(నార్త్‌) నుంచి విజయం సాధించారు. రీవాబాకు 84,336 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి బీపేంద్రసిన్హ్‌ జడేజాకు 22,822 ఓట్లు దక్కాయి.

* ఆప్‌ రాష్ట్ర చీఫ్‌ గోపాల్ ఇటాలియా కటార్‌గామ్‌ నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి వినోద్‌ మోరాదియా దాదాపు 65వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు