Bjp: భాజపాకు రూ.1000 విరాళంగా ఇచ్చిన ప్రధాని

భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను...

Published : 26 Dec 2021 01:20 IST

దిల్లీ: భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను రూ.1000 విరాళంగా ఇచ్చినట్లు, పార్టీ మద్దతుదారులంతా విరాళాలు ఇవ్వాలని కోరుతూ ప్రధాని ట్వీట్‌ చేశారు. ఎల్లప్పుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేదే భాజపా విధానమని, దేశ సంస్కృతిని కాపాడుతూ నిస్వార్థంగా జీవితాంతం సేవ చేయడమే భాజపా క్యాడర్‌ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం మద్దతు దారులు ఇచ్చే మైక్రోడొనేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తద్వారా భాజపా బలోపేతమవుతుందని ట్వీట్‌ చేశారు. డోనేషన్‌ ఇచ్చిన రసీదును ప్రధాని ట్వీట్‌కు జతచేశారు. ఇందులో  మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌, పాన్‌కార్డు నెంబర్‌ గోప్యత దృష్ట్యా చూపించలేదు. ఎందుకోసం డొనేషన్‌ ఇస్తున్నారు అన్న చోట పార్టీ ఫండ్ అని చూపించారు.విరాళం మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా కూడా రూ.1000 విరాళంగా ఇచ్చారు. నమో యాప్‌లో డొనేషన్‌ మాడ్యూల్‌ ద్వారా విరాళం ఇచ్చిన ఆయన  భాజపాను బలోపేతం చేయడానికి తన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మద్దతుదారులతో పాటు, వారికి ప్రజా జీవితంలోని సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను కూడా రెఫరల్‌ కోడ్‌ ఉపయోగించి విరాళాలు అందించడంలో భాగస్వాముల్ని చేయాలని జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రారంభించిన మైక్రోడొనేషన్స్‌ స్వీకరణ దీనదయాళ్‌ జీ పుణ్యతిథి అయిన ఫిబ్రవరి 11, 2022వరకు కొనసాగుతుందని తెలిపారు.రూ.5నుంచి రూ.1000 వరకు విరాళాలుగా అందించవచ్చని నడ్డా ఒక ప్రకటనలో తెలిపారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని