Jagga Reddy: రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించారు.

Published : 03 Jul 2022 14:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చర్చించలేదని.. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే తమతో చర్చించినట్లు ఆయన చెప్పారని ఆరోపించారు. గోడకు వేసి కొడతా అంటూ అవమానపరిచేలా రేవంత్‌ మాట్లాడుతున్నారని.. అలా రెచ్చగొట్టడం వల్లే తాను మీడియా ముందు మాట్లాడానన్నారు. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలన్నారు.

అసలేం జరిగిందంటే..

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించగా.. శనివారం ఆయనను కలవడానికి వచ్చిన సందర్భంగా రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. సిన్హాను వీహెచ్‌ కలిసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందించారు. ‘ఆ ఇంటిమీద వాలిన కాకి.. ఈ ఇంటిమీద వాలితే ఊరుకోం.. కాలుస్తాం.. సీఎం కేసీఆర్‌ను కలిసిన వ్యక్తి బ్రహ్మదేవుడైనా మేం కలిసేది లేదు.. అందుకే యశ్వంత్‌సిన్హాను మేం కలవలేదు’ అని స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దీన్ని పార్టీ నేతలెవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తీసి గోడకేసి కొడతాం’ అని వ్యాఖ్యానించారు. 

రేవంత్‌ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పార్టీ రేవంత్‌ అయ్య జాగీరు కాదు, ఆయనెవరు సిన్హాను కలవొద్దనడానికి? దీనిపై అగ్రనేతలకు ఫిర్యాదు చేస్తా’’ అని చెప్పారు. అసెంబ్లీ మీడియాహాలులో జగ్గారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘సీనియర్‌ నాయకుడైన హనుమంతరావును గోడకేసి కొడతానంటావా? ఆయన సిన్హాను కలవడంలో తప్పులేదు. సిన్హాను పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్‌గాంధీ నామినేషన్‌ వేయించారు. మేం నీకు నౌకర్లమా? బంట్రోతులమా?’ అంటూ మండిపడ్డారు. రేవంత్‌ చిల్లర రాజకీయం చేస్తున్నాడు. సీఎల్పీకి చెప్పకుండానే జిల్లా నేతలకు కండువా కప్పుతున్నాడు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పినందుకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నా’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మళ్లీ జగ్గారెడ్డి స్పందిస్తూ రేపు ఓ సంచలన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని