Janasena: జగన్‌ నిర్ణయాలంటే జనం భయపడుతున్నారు: నాదెండ్ల మనోహర్‌

జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏ క్షణాన ఏ పన్ను వేస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందో తెలియక పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని జనసేన

Updated : 02 Apr 2022 06:09 IST

కాకినాడ: జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏ క్షణాన ఏ పన్ను వేస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందో తెలియక పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కలిసి కాకినాడ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్‌రెడ్డి ఫ్యాన్‌ గుర్తు చూసి ఓటేసిన వారు ఈరోజు ఇంట్లో ఫ్యాన్‌ వేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు జనసేన పోరాటం చేస్తుందని తెలిపారు.

‘‘యువకుడైన జగన్‌ చక్కటి పరిపాలన అందిస్తారని రాష్ట్ర ప్రజలు భావించారు. గతంలో మీరు బాదుడే... బాదుడు అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ తిరిగారు. ఈరోజు ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసిన ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగకుండా చేశారు. ఫ్యాన్‌ ఆన్‌ చేయాలంటేనే సామాన్య మధ్యతరగతి ప్రజలకు భయం వేస్తోంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటికి సగటున రూ.500 పెంచేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ఈ రాష్ట్రానికి మంచి జరగాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

భారీ నిరసన ప్రదర్శన.. రోడ్డుపై బైఠాయింపు..

అంతకుముందు విద్యుత్‌ ఛార్జీల పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నినదిస్తూ జడ్పీ సెంటర్‌ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ మీదుగా ధర్నా చౌక్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయం వైపు వెళ్తుంటే పోలీసులు ఆంక్షలు విధించడంతో ధర్నా చౌక్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని