KishanReddy: ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి .. కేసీఆర్‌ సీఎం పీఠమెక్కారు: కిషన్‌రెడ్డి

కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Updated : 06 Jul 2023 18:02 IST

హైదరాబాద్‌: కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

‘‘భారతీయ జనతాపార్టీ రెండు ప్రధాన అంశాలపై పోరాటం కొనసాగిస్తోంది. ఒకటి కుటుంబ పాలన, రెండోది అవినీతి. ఈ రెండు విషయాల్లో ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఎర్రకోట నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ చేతిలో బందీ అయింది.  రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోంది. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదు. నిరంకుశ పాలనకు పాతరేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయాలి.

ఇవీ చదవండి.. మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఈటల ఆగ్రహం

ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్‌ సీఎం పీఠం ఎక్కారు. గిరిజన బంధు అమలు ఏమైందో కేసీఆర్‌ చెప్పాలి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అతీగతీ లేదు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆసుపత్రులు నిర్మిస్తామనే హామీ ఏమైంది. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైందో సీఎం కేసీఆర్‌ చెప్పాలి. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ, పేదలకు ఇవ్వట్లేదు. కేంద్రం సైన్స్‌ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదు. ఫలక్‌నుమా వరకు నడవాల్సిన మెట్రో ఎంజీబీఎస్‌ వద్దే ఆగింది. పాతబస్తీకి మెట్రో లైన్‌ ఎందుకు నిర్మించట్లేదో కేసీఆర్‌ చెప్పాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే భారాసకు వేసినట్టే..

‘‘కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో మాపై  విష ప్రచారం జరుగుతోంది. గతంలో పొత్తులు పెట్టుకుంది. ఒప్పందాలు కుదుర్చుకుంది కాంగ్రెస్‌, భారాస పార్టీలే.  కేంద్రంలో అధికారం పంచుకున్న కాంగ్రెస్‌, భారాస రెండు పార్టీలు కలిసి భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే భారాసకు వేసినట్టే, ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. నాణేనికి బొమ్మాబొరుసు లాంటివి.  కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మంత్రులుగా ఉన్నారు.  మేము ఏనాడూ.. కాంగ్రెస్‌, భారాసతో కలవలేదు. తెలంగాణ సమాజానికి అండగా నిలబడటమే మా ధ్యేయం. ఒక కుటుంబమే పరిపాలన చేయటం తెంగాణ మోడలా? తొమ్మిదేళ్లు సచివాలయానికి రాకపోవటం తెలంగాణ మోడలా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని