Telangana news: ఆ జీవో రద్దుచేయకపోతే దీక్షకు సిద్ధమవుతా: ఎంపీ కోమటిరెడ్డి

కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ

Published : 31 Aug 2022 01:20 IST

హైదరాబాద్‌: కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్‌చేశారు. ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈనెల 18న జారీ చేసిన ఈ జీవో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ-మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రోజుకు 8 నుంచి 11 టీఎంసీలు మేర కృష్ణా జలాలను తోడుకుపోతున్నా సీఎం కేసీఆర్‌పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీవో నెంబరు 246ని రద్దు చేయకపోతే తాను దీక్షకు సిద్ధమవుతానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హెచ్చరించారు. అందుబాటులో ఉన్న 90 టీఎంసీల నీటిలో 30 టీఎంసీలు ఎస్‌ఎల్‌బీసీకి, 40 టీఎంసీలు పాలమూరు -రంగారెడ్డి, 20 టీఎంసీలు డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ నీటి కేటాయింపు విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కలుస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని