KTR: ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే హంగ్‌ వచ్చేది: కేటీఆర్‌

భారాస ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 21 Jan 2024 14:29 IST

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 చోట్ల ఓటమి పాలయ్యామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజిగిరి లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని, మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని చెప్పారు. 

‘‘200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్‌ రెడ్డి.. నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పారు. వారి మాటలనే నేను గుర్తు చేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విధ్వంసకర మనస్తత్వంగా కనిపిస్తుందట! సోనియా గాంధీకి ప్రజలు కరెంట్ బిల్లులు పంపేలా భారాస ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలి. నిరుద్యోగ భృతిపై తప్పించుకున్నట్లే.. పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చింది. పార్టీ కమిటీలు పూర్తి చేయకపోవడం వల్ల నష్టం జరిగింది.. ఇక ముందు అలా జరగదు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌కు భయపడే పార్టీ భారాస కాదు. దిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే గులాబీ పార్టీ గెలవాలి’’ అని కేటీఆర్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని