ఆ రెండు కూటములూ అవినీతికి పర్యాయపదాలు: నడ్డా 

సీపీఎం, కాంగ్రెస్‌.. రెండు పార్టీలూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాయని, సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని భాజపా జాతీయ....

Updated : 27 Mar 2021 16:36 IST

కన్నూర్‌: సీపీఎం, కాంగ్రెస్‌.. రెండు పార్టీలూ అయోమయంలో ఉన్నాయని, సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. కన్నూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేరళలో అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములను అవినీతికి పర్యాయ పదాలుగా అభివర్ణించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ప్రజలు స్వస్తి చెప్పాల్సిన సమయమిదేనన్నారు. శనివారం నడ్డా ధర్మదామ్‌లో ఎన్డీయే నుంచి  పోటీ చేస్తున్న సీకే పద్మనాభన్‌ తరఫున చక్కరక్కల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూడీఎఫ్‌ హయాంలో సోలార్‌ కుంభకోణం, ఎల్డీఎఫ్‌ హయాంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ రెండు కూటముల అవినీతిని ప్రజలు అర్థంచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్‌, సీపీఎం కేరళలో ఒకరిపై ఒకరు పోటీ పడుతూ.. బెంగాల్‌లో మాత్రం భాజపాకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయంటూ మండిపడ్డారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేరళ అభివృద్ధి కోసం రూ.2లక్షల కోట్లు ఇచ్చామన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినదానికంటే ఇది మూడు రెట్లు అధికమని చెప్పారు. శబరిమల అంశాన్ని ప్రస్తావించిన నడ్డా.. భాజపా స్థిరంగా పోరాడుతోందన్నారు. అయితే, సీపీఎం, సీఎం పినరయి విజయన్‌ తమ పోరాటాన్ని అణిచివేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ మాత్రం కేవలం మాటలకే పరిమితమైపోయిందని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని