దీదీ ఇక ఒంటరే..!

ఎన్నికల సమయం నాటికి బెంగాల్‌లో దీదీ వైపు ఏ ఒక్కరూ మిగలరన్న అమిత్‌ షా.. రాబోయే రోజుల్లో భాజపాలోకి మరిన్ని వలసలు ఉంటాయనే సంకేతమిచ్చారు.

Published : 31 Jan 2021 16:11 IST

అల్లుడి శ్రేయస్సు కోసమే దీదీ తపన
వామపక్షాల కంటే దారుణ పాలన - అమిత్ షా విమర్శ

దిల్లీ: తృణమూల్‌ నేతలు భాజపాలో చేరడానికి మమతా ప్రభుత్వం వైఫల్యమే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల కాలం కంటే దారుణ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తుంటే, బెంగాల్‌లో దీదీ మాత్రం తన అల్లుడి కోసం మాత్రమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయం నాటికి దీదీ వైపు ఏ ఒక్కరూ మిగలరన్న ఆయన.. రాబోయే రోజుల్లో భాజపాలోకి మరిన్ని వలసలు ఉంటాయనే సంకేతమిచ్చారు. దీంతో మమతా బెనర్జీ తన ప్రభుత్వ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో దోపిడి, అవినీతి పాలన కొనసాగుతోందని విరుచుకుపడ్డ అమిత్‌ షా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు. హౌరాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు.

పశ్చిమ బెంగాల్‌లో లూటీ..!
లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో దాదాపు 80కోట్ల మంది ప్రజలకు ఐదు కిలోల బియ్యం, కిలో పప్పును ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం అందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. కానీ, బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వం వాటన్నింటినీ లూటీ చేసిందని ఆరోపించారు. దేశంలో వలస కార్మికుల కోసం దాదాపు 50కోట్ల పనిరోజులను కల్పిస్తే, బెంగాల్‌ ప్రభుత్వం వాటిని అమలుచేయకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.

ఇదిలాఉంటే, తృణమూల్‌ను వీడిన మాజీ మంత్రి రాజీబ్‌ బెనర్జీ, ఎమ్మెల్యేలు ప్రబీర్‌ ఘోషల్‌, బైశాలి దాల్మియా, హౌరా మాజీ మేయర్‌ రతిన్‌ చక్రవర్తి తదితర నేతలు శనివారం నాడు దిల్లీలో హోంమంత్రి సమక్షంలో భాజపాలో చేరారు. రానున్న రోజుల్లో ఈ వలసలు మరింత పెరుగుతాయని భాజపా భావిస్తుండగా, తృణమూల్‌ మాత్రం పార్టీని వీడుతున్న వారికి సుదీర్ఘ రాజకీయ చరిత్రేమీ లేదని పేర్కొంటోంది.

ఇవీ చదవండి..
తృణమూల్‌లో పెరుగుతోన్న అసమ్మతి..!
బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ పొత్తు కుదిరింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని