Telangana News: ఆర్మీలోనూ కాంట్రాక్టు ఉద్యోగాలా..?: హరీశ్‌రావు

సమాజంలో జవాన్లకు ఉన్న గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘అగ్నిపథ్‌’ తెచ్చి యువతను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు...

Published : 21 Jun 2022 01:43 IST

సంగారెడ్డి: సమాజంలో జవాన్లకు ఉన్న గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘అగ్నిపథ్‌’ తెచ్చి యువతను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. మోదీ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రూ.37 కోట్ల వ్యయంతో 14 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు.

కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మోదీ పాలనలో డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమని.. కేసీఆర్‌ సీఎం అయ్యాక రైతుల గౌరవం, భూముల ధరలు పెరిగాయన్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో సాగుకు గిరాకీ పెరిగిందని వెల్లడించారు. మరోవైపు మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. తాజాగా ఆర్మీలోనూ కాంట్రాక్టు ఉద్యోగాల పద్ధతిని ప్రధాని మోదీ తెచ్చారని విమర్శించారు. ఆర్మీలో నాలుగేళ్లు పని చేసిన తర్వాత యువత ఎక్కడి వెళ్లాలని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వారికి ఉద్యోగ భద్రత, పింఛను ఎందుకు ఉండకూడదని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని