Malla Reddy: నా కుమారుడు భయంతో వణికిపోతున్నాడు: మంత్రి మల్లారెడ్డి

తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దాడులు చేయిస్తోందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. హవాలా, బ్లాక్‌ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధంగా కళాశాలలు నడుపుతున్నానని చెప్పారు.

Updated : 23 Nov 2022 16:08 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి నివాసం, సంస్థలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు కొనసాగుతుండగా.. ఇప్పటికే పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దాడులు చేయిస్తోందని ఆరోపించారు. హవాలా, బ్లాక్‌ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధంగా కళాశాలలు నడుపుతున్నానని చెప్పారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తమ సమీప బంధువు ప్రవీణ్‌రెడ్డిని తీసుకుని ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ‘‘మా కుటుంబంపై బీభత్సం చేస్తున్నారు. రాజకీయ కక్షతో దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నా కుమారుడు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు’’ అని మల్లారెడ్డి తెలిపారు. మరో వైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పనిచేసే మహిళకు ఫిట్స్‌ రావడంతో వెంటనే స్పందించిన ఐటీ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.   

మల్లారెడ్డి ఇల్లు, సంస్థలు, బంధువులకు సంబంధించిన ఇళ్లపై మంగళవారం దాడులు చేపట్టిన ఐటీ శాఖ.. నేడూ వాటిని కొనసాగించింది. మరోవైపు మంత్రి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి గురువారం ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురై సూరారంలోని ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఇంటికి పలువురు నేతలు, కార్యకర్తలు తరలివచ్చి పరామర్శించారు. మంత్రికి చెందిన సంస్థలు, ఇళ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ కీసరలో తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.  

రేపు నగరానికి మల్లారెడ్డి అల్లుడు

మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు, తెరాస నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి రేపు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. గత నాలుగు రోజులుగా తుర్కియేలో ఉన్న ఆయన.. గురువారం నగరానికి రానున్నట్లు తెరాస వర్గాలు తెలిపాయి. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌ తిరిగి రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని