విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు: విజయసాయి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు సేకరించామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Updated : 23 Mar 2022 06:05 IST

దిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు సేకరించామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిందన్నారు. పరిశ్రమకు నష్టాలంటే ప్రజలను తప్పుదోవ పట్టించినట్లేనన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

‘‘రూ.4,200 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇస్తాం. రాష్ట్రం వాటా రుణం రూపంలో ఇచ్చేందుకు అనుమతి కోరాం. త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటవుతుందని చెప్పారు. దక్షిణమధ్య రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరాం. అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నాం. ఏపీకి 2 వందే భారత్‌ రైళ్లు ఇవ్వాలని మంత్రిని కోరాం. విశాఖ-హైదరాబాద్‌, విశాఖ-చెన్నై మధ్య రైళ్లు నడపాలని కోరాం’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. ముదిగుబ్బ-ముద్దునూరు మధ్య 65 కి.మీ రైల్వేలైను వేయాలని కేంద్ర రైల్వేమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్టు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తెలిపారు.  బనగానపల్లె-కర్నూలు మధ్య 70కి.మీ మేర రైల్వే లైనుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కొత్త లైను ఏర్పాటుకు ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించారని, కొత్త రైల్వే లైనును త్వరగా మంజూరు చేయాలని కోరామన్నారు. ప్రతిపాదిత మార్గాల్లో అనేక సిమెంట్‌, ఇతర పరిశ్రమలు ఉన్నాయని అవినాష్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని