PM Modi: మీకు సేవ చేసేందుకే ఇంటి నుంచి వచ్చేశా..: ‘కుటుంబం లేదన్న’ లాలూ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్‌

PM Modi: 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని అన్నారు ప్రధాని మోదీ. కుటుంబం గురించి ఆర్జేడీ చీఫ్‌ లాలూ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 04 Mar 2024 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రధానికి కుటుంబం లేదు’ అంటూ ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ (PM Modi) దీటుగా బదులిచ్చారు. ఈ దేశమంతా తన కుటుంబమేనని, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఆదిలాబాద్‌లోని బహిరంగసభలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే..

బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ చేపట్టిన ‘జన విశ్వాస యాత్ర’లో ఆయన తండ్రి లాలూ మాట్లాడుతూ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానికి కుటుంబం లేదు. అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై  విమర్శలు చేస్తున్నారు’’ అని అన్నారు. దీనికి మోదీ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.

కాళేశ్వరం విషయంలో భారాసతో కాంగ్రెస్‌ కుమ్మక్కు: ప్రధాని మోదీ

‘‘140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు.. వీరంతా నా కుటుంబసభ్యులే. దేశంలోని ప్రతి పేద వ్యక్తీ నా కుటుంబమే. ఎవరూ లేని వారికి మోదీ ఉన్నారు. మోదీకి వారంతా ఉన్నారు. ‘మేరా భారత్‌ - మేరా పరివార్‌’ అనే భావనతోనే నేను జీవిస్తున్నా. మీ కోసం పోరాడుతున్నా. నా జీవితం తెరిచిన పుస్తకం. నేనెంటో దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రతి క్షణం మీకు సేవ చేసేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చా. మీ కలలే నా ఆశయాలు. వాటిని నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడుతా’’ అని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘‘అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిన విపక్ష కూటమి నేతలు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే 2024 ఎన్నికలకు వారి నిజమైన మేనిఫెస్టోను బయటపెడుతున్నారు. వారి కుటుంబ రాజకీయాలపై నేను ప్రశ్నించినందుకే.. మోదీకి కుటుంబం లేదంటూ కొత్త విమర్శలు మొదలుపెట్టారు’’ అని తిప్పికొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని