JP Nadda: ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు.. గహ్లోత్‌ సర్కార్‌పై నడ్డా ఫైర్‌

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడ ఎన్నికల ప్రచార శంఖాన్ని పూరించారు. రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.

Published : 16 Jul 2023 16:45 IST

జైపుర్‌:  రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ అంటే అణిచివేత, పక్షపాతం, అరాచకాలేన్నారు. రాజస్థాన్‌ ప్రజల్ని దోచుకుంటూ వారిపై హింసాకాండకు పాల్పడుతున్న అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌కు ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు.  ఈ ఏడాది చివరలో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు(Rajasthan Assembly Polls) జరగనున్న వేళ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌(Congress) సారథ్యంలోని యూపీఏపై విమర్శలు గుప్పించిన నడ్డా.. మరోసారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సారథ్యంలోని ఎన్డీయే సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌యా ప్రయాస్‌ అనే మంత్రంతో పనిచేస్తోందని కొనియాడారు. 

రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్నయ్యలాల్‌ హత్యోదంతం, వంటి ఘటనలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాల చిట్టాను విడుదల చేశారు. దళితులు, గిరిజనులు, మహిళలు, చిన్నారులు, పేదలపై అరాచకాలు సృష్టించడంలో కాంగ్రెస్‌ రికార్డులను  బ్రేక్‌ చేసిందంటూ ఎద్దేవా చేశారు.  అవినీతిని ప్రోత్సహించడం, అవినీతిలో కొత్త రికార్డులు సృష్టించడం రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్‌ సర్కార్‌ లక్షణమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన శరణార్థుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేతకు పాల్పడుతోందంటూ విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని