Nara Lokesh: జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.

Updated : 02 Feb 2024 14:27 IST

అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు. ‘‘ఆర్థిక ఉగ్రవాది జ‌గ‌న్‌ పాల‌కుడు అవడంతో రాష్ట్రంలో వ‌న‌రుల‌న్నీ దోపిడీకి గురై అరాచ‌కం రాజ్యమేలుతోంది. కొంతమంది పోలీసులు దొంగ‌లు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారు. రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం జ‌గ‌న్ ఖాకీల‌ను ప్రైవేటు ఫ్యాక్షన్‌ సైన్యంగా వాడ‌టంతో వారికీ నేరాలు అల‌వాటైపోయాయి’’ అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. 

పాల‌కులే సీఐడీని కిడ్నాపులు, బెదిరింపుల‌కు వినియోగిస్తున్నారు. తాము ఏం చేసినా అడిగేవారు లేర‌ని పోలీసులు ముఠాలుగా ఏర్పడటం ఆ వ్యవస్థ గౌర‌వాన్ని మంట‌గ‌లిపింది. కర్నూలు డీఐజీ ఆఫీస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సుజన్ ఓ ముఠాని ఏర్పాటు చేసి.. ఏపీ సీఐడీ బృందం పేరుతో ఐటీ కంపెనీ య‌జ‌మానిని కిడ్నాప్ చేసి హైద‌రాబాద్‌లో చిక్కిన ఘ‌ట‌న ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైద‌రాబాద్ పోలీసుల‌కు చిక్కడం ఏపీలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారిన దుస్థితిని వెల్లడిస్తోంది’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని