Karnataka: 10మంది భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.., స్పీకర్‌పై అవిశ్వాసానికి ప్రతిపక్షాల నోటీసు

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన 10 మంది భాజపా ఎమ్మెల్యేలపై స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు.

Published : 19 Jul 2023 19:34 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు (Karnataka Assembly) నేడు రసాభాసగా కొనసాగాయి. ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోడియంను చుట్టుముట్టిన భాజపా సభ్యులు.. కాగితాలను చింపి స్పీకర్‌ ఛైర్‌పైకి విసిరేశారు. వీరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్‌ (Speaker).. మంత్రి సిఫార్సు మేరకు 10మంది భాజపా సభ్యులను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం.. స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయనపై భాజపాతోపాటు జేడీఎస్‌లు సంయుక్తంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.

ఎంపీల ‘అక్రమ సంబంధం’తో రాజీనామాలు.. సింగపూర్‌ పార్లమెంటులో కుదుపు

నేడు సమావేశాలు మొదలైన వెంటనే.. ఐఏఎస్‌ల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. ఇదే సమయంలో మధ్యాహ్న భోజన సమయం లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతాయని స్పీకర్‌ నిర్ణయించారు. దీంతో ఆగ్రహించిన భాజపా సభ్యులు.. స్పీకర్‌ ఛైర్‌ వద్దకు వెళ్లి కాగితాలను చింపి విసిరేశారు. ఆ సమయంలో స్పీకర్‌ ఛైర్‌లో డిప్యూటీ స్పీకర్‌ రుద్రప్ప లమానీ ఉన్నారు. దీంతో 10మంది భాజపా సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి హెచ్‌కే పాటిల్‌ ప్రవేశ పెట్టిన తీర్మానానికి స్పీకర్‌ ఆమోదం తెలిపారు. అనంతరం సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విధానసౌధ బయట మాజీ సీఎం బొమ్మైతో సహా పలువురు నిరసన చేపట్టగా.. వారందర్నీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్‌ యూటీ ఖాదెర్‌పై అవిశ్వాస తీర్మానానికి భాజపా, జేడీఎస్‌ పార్టీలు సంయుక్తంగా నోటీసులు ఇచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జులై 3న ప్రారంభం కాగా.. జులై 21 వరకు కొనసాగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని