JP Nadda: విషం చిమ్మే విపక్ష కూటమి అవసరమా?: జేపీ నడ్డా

విపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. 

Published : 03 Sep 2023 17:29 IST

భోపాల్‌: విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతోందని, కొన్ని వర్గాలపై విషం చిమ్ముతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. దేశ ప్రజలంతా ఆ కూటమిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో నడ్డా మాట్లాడారు. ప్రపంచంలో భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరారు. ‘వందేమాతరం’ నినాదాల నడుమ ‘జన్‌ ఆశీర్వాద్‌’ యాత్రను నడ్డా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ ‘ఇండియా’ కూటమికి చెందిన వివిధ పార్టీల నేతలు ఇటీవల ముంబయిలో సమావేశమయ్యారు. ఆ తర్వాత నుంచి భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంపై దాడికి దిగడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఉదయనిధి స్టాలిన్‌ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్‌, మలేరియాతో పోల్చి చెప్పడం చాలా బాధాకరం’’ అని నడ్డా అన్నారు.

భారతదేశ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న అలాంటి కూటములను తీసి అవతల విసిరేయాలని నడ్డా పిలుపునిచ్చారు. విపక్ష పార్టీల నేతలు దేశ వారసత్వాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారని విమర్శించారు. అలాంటి ఆలోచనలను కచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబరు 2024లో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, నవంబరు 2024లో జరగనున్న జనరల్‌ ఎన్నికల్లోనూ మధ్యప్రదేశ్‌లో భాజపాను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పయనిస్తున్న తరుణంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండటం మంచి పరిణామమని చెప్పారు. భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మళ్లీ భాజపాయే అధికారంలోకి రావాలని నడ్డా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు