Telangana News: తాండూరు తెరాసలో ‘పొలిటికల్‌ హీట్‌’.. ఎమ్మెల్సీ వర్సెస్‌ ఎమ్మెల్యే!

వికారాబాద్‌ జిల్లా తాండూరులో సీఐ రాజేందర్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అక్కడి తెరాస రాజకీయాల్లో మరింత ‘హీట్‌’ పుట్టించింది.

Updated : 28 Apr 2022 15:03 IST

సీఐపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో..

ఇంటర్నెట్‌డెస్క్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరులో సీఐ రాజేందర్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అక్కడి తెరాస రాజకీయాల్లో మరింత ‘హీట్‌’ పుట్టించింది. ఈ విషయంలో అధికార పార్టీకే చెందిన మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మరోవైపు సీఐపై మహేందర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది. 353, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. 

అసలేం జరిగిందంటే..

తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో సోషల్‌ మీడియాలో బుధవారం వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఐదురోజుల క్రితం తాండూరులోని భావిగీ భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో రౌడీషీటర్లకు పోలీసులు ప్రాధాన్యమిచ్చారని ఎమ్మెల్సీ ఆడియోలో ఆరోపించారు. వారికి కార్పెట్‌ ఎందుకు వేశారంటూ సీఐని దుర్భాషలాడుతూ నిలదీశారు. దీనిపై స్పందించిన సీఐ కార్పెట్‌ వేయటం తమ పని కాదని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్సీ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నీ అంతు చూస్తానని సీఐని బెదిరించారు. ఈ విషయంపై సీఐ రాజేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం దీనిపై సీఐ రాజేందర్ రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్సీపై కేసు నమోదైందని.. తనను ఆయన దూషించారా? లేదా? అనేది దర్యాప్తులో తేలుతుందని వెల్లడిచారు. 

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డే ఇదంతా చేయిస్తున్నారు: మహేందర్‌రెడ్డి 

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఐ రాజేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మాట వాస్తవమేనని.. అయితే సీఐను తాను తిట్టలేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో సీఐను తిట్టినట్లు వైరల్‌ అవుతున్న ఆడియోలోని సంభాషణలు తనవి కాదన్నారు.  కావాలనే ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఎమ్మెల్యే టికెట్‌ తనదేనని చెప్పారు. సీఐతో మాట్లాడిన వ్యవహారంలో పోలీసులు తనకు నోటీసులు ఇస్తే స్పందిస్తానని మహేందర్‌రెడ్డి తెలిపారు.

మనసులో ఏదో పెట్టుకుని గొడవలు చేస్తే దానికి నేను కారణమా?: రోహిత్‌రెడ్డి

మహేందర్‌రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్‌రెడ్డి మనసులో ఏదో పెట్టుకుని గొడవలు చేస్తే దానికి తాను కారణం కాదన్నారు. తాండూరు ప్రజలను రౌడీలని ఎలా అంటారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. స్థానిక ప్రజలకు అసలు నిజాలేంటో తెలుసన్నారు. సీఐని మహేందర్‌రెడ్డి దూషించిన విషయంలో తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. సీఐని దూషించలేదన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మహేందర్‌రెడ్డి వివాదంపై ఇప్పటి వరకు అధిష్ఠానానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. తప్పకుండా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఎమ్మెల్యే టికెట్‌ తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు