Bihar: నీతీశ్‌, పీకే భేటీ.. అందుకోసమేనా..?

ఇటీవల కాలంలో బిహార్‌ రాజకీయాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Published : 15 Sep 2022 02:02 IST

పట్నా: ఇటీవల కాలంలో బిహార్‌ రాజకీయాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్(పీకే) సమావేశం కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపర్చింది. నీతీశ్‌పై విమర్శలు గుప్పించే ప్రశాంత్‌..  సీఎంతో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. దాంతో ఆయన ప్రధాని మిషన్‌ను పూర్తి చేసేందుకే ఈ భేటీ జరిగిందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. 

ప్రశాంత్‌, నీతీశ్‌ మధ్య సమావేశం ఏర్పాటు చేసే విషయంలో జేడీయూ మాజీ ఎంపీ పవన్‌ వర్మ కీలకంగా వ్యవహరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ఈ భేటీకి ముందువరకూ జేడీయూ అగ్రనేతపై పీకే తీవ్ర పలుసార్లు విమర్శలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ముఖ్యమంత్రి పీఠంపై నీతీశే ఉంటారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

నీతీశ్‌ ఇటీవలే భాజపాతో బంధం తెంచుకొని, తన ప్రత్యర్థి పార్టీ అయిన ఆర్జేడీతో దోస్తీ కట్టారు. ఇటు భాజపా, అటు ఆర్జేడీ పార్టీలకన్నా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వచ్చిన సీట్ల సంఖ్య తక్కువ. కానీ ఎవరితో పొత్తులో ఉన్నా.. ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం ఆయనే ఉంటున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీతో నీతీశ్‌ కల నెరవేర్చేందుకు కిశోర్‌ వ్యూహకర్తగా వ్యవహరిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని