Warren Buffett: భారత మార్కెట్‌లో చాలా అవకాశాలున్నాయి: వారెన్‌ బఫెట్‌

Warren Buffett: భారత మార్కెట్‌లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వే సిద్ధంగా ఉందని వారెన్‌ బఫెల్‌ తెలిపారు.

Published : 05 May 2024 19:12 IST

వాషింగ్టన్‌: భారత మార్కెట్‌లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ మదుపరి, బిలియనీర్‌ వారెన్ బఫెట్ (Warren Buffett) అన్నారు. తమ హోల్డింగ్‌ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే భవిష్యత్తులో వాటిని ఒడిసిపట్టనుందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలపై మాట్లాడుతూ కంపెనీ వార్షిక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో వ్యాపారాలపై బెర్క్‌షైర్‌కు ఏ మేర అవగాహన ఉంది.. ఆయా పెట్టుబడులను సాధ్యం చేసే పరిచయాలేమైనా ఉన్నాయా అన్నదే ఇప్పుడు తమ ముందున్న ప్రశ్న అని బఫెట్ (Warren Buffett) తెలిపారు. ప్రయోజనం ఉంటే కచ్చితంగా భవిష్యత్తులో ఆయా అవకాశాలను అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు.

బెర్క్‌షైర్‌ తీసుకున్న పలు పెట్టుబడుల నిర్ణయాలపై సంధించిన ప్రశ్నలకు ఈ సమావేశంలో బఫెట్‌ (Warren Buffett) సమాధానమిచ్చారు. యాపిల్‌లో వాటాలు తగ్గించుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ నిర్ణయం వెనుక ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహం లేదని స్పష్టం చేశారు. తమకు అత్యధిక వాటాలున్న కంపెనీల జాబితాలో యాపిల్‌ కొనసాగుతుందని చెప్పారు. అలాగే తన తర్వాత బెర్క్‌షైర్‌ను నడిపించడానికి వైస్‌ ఛైర్మన్‌ గ్రెగ్‌ అబెల్‌, అజిత్ జైన్‌ సమర్థులని ఇప్పటికే నిరూపించుకున్నారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని