Rahul Gandhi: అమేఠీ బరిలో రాహుల్‌.. స్పష్టతనిచ్చిన కాంగ్రెస్‌ నేత!

రాహుల్‌ అమేఠీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైంది. యూపీకి చెందిన ఆ పార్టీ నేత ఒకరు దీనిని వెల్లడించారు. 

Published : 06 Mar 2024 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా అమేఠీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింఘాల్‌ చెప్పారు. ఆయన దిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. 

అమేఠీ కాంగ్రెస్‌కు కంచుకోట. 1967లో ఈ స్థానం ఏర్పాటు చేసిన నాటి నుంచి వరుసగా 2019 వరకూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడి నుంచి సంజయ్‌ గాంధీ రెండు సార్లు, రాజీవ్‌ గాంధీ మూడు సార్లు, సోనియా గాంధీ ఒకసారి బరిలో నిలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రాహుల్‌ 2002 నుంచి ఆ పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేస్తున్నారు. 2019 మినహా మిగిలిన అన్ని సార్లు ఆయనే గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తొలిసారి ఈ స్థానం కాంగ్రెస్‌ చేజారినట్లైంది. 

ఈ సారి కూడా భాజపా తరపున స్మృతి బరిలో నిలిచారు. ఇటీవల కమలం పార్టీ ప్రకటించిన 195 మంది అభ్యర్థుల జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. దీంతో ఈ సారి కూడా బలమైన పోటీ జరిగే అవకాశాలున్నాయి. 2014లో ఆమె రాహుల్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని