Maharashtra: శరద్‌ పవార్‌ ఆశీస్సుల వల్లే.. ఎన్‌సీపీలో తిరుగుబాటు..!

మహారాష్ట్ర పరిణామాలపై ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల వెనక ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar) హస్తం ఉండొచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు. 

Updated : 05 Jul 2023 11:14 IST

పుణె: మహారాష్ట్ర(Maharashtra)లో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్(Sharad Pawar) పుణ్యమేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) అధినేత రాజ్‌ ఠాక్రే(Raj Thackeray) అన్నారు. మూడురోజుల క్రితం ఎన్‌సీపీ పార్టీ నిట్టనిలువునా చీలిపోవడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 

‘ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అసహ్యకరంగా ఉన్నాయి. ఇది ఓటు వేసినవారిని తీవ్రంగా అవమానించడం కిందికే వస్తుంది. మహారాష్ట్రలో ఇలాంటి తీరును మొదలుపెట్టింది శరద్‌ పవారే. 1978లో అప్పటి ప్రభుత్వంలో పవార్‌ ఈ తరహా ప్రయోగాలు చేశారు. అంతకుముందు అలాంటి పరిణామాలు మహారాష్ట్రలో కనిపించలేదు. ఇలాంటివి పవార్‌తోనే మొదలై.. పవార్‌తోనే ముగిశాయి’అని వ్యాఖ్యానించారు. 

‘ప్రస్తుతం జరుగుతున్నవాటి వెనక పవార్‌ హస్తం ఉండి ఉంటుంది. శరద్ పవార్ ఆశీస్సులు లేకుండా ప్రఫుల్‌ పటేల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌, చగన్‌ భుజ్‌బల్ వంటివారు అజిత్‌తో వెళ్లే రకం కాదు’అని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేయడం అక్కడి రాజకీయాలను మరోసారి కుదిపేసిన సంగతి తెలిసిందే.  తన బాబాయి శరద్‌ పవార్‌ అనుసరించిన బాటనే ఇప్పుడు అబ్బాయి అజిత్‌ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 1978లో 40 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చి వసంతదాదా పాటిల్‌ ప్రభుత్వాన్ని అప్పట్లో శరద్‌ పవార్‌ కూల్చేశారు. దీనిని ఉద్దేశించే ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని