Rajnath Singh: అప్పట్లో గాంధీజీ, సర్దార్‌ పటేల్‌.. ఇప్పుడు ప్రధాని మోదీ: రాజ్‌నాథ్‌

గుజరాత్ రాష్ట్రానికి 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌లు గౌరవ చిహ్నాలుగా నిలిస్తే,  21వ శతాబ్దంలో ప్రధాని మోదీ గౌరవ చిహ్నాంగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అన్నారు.

Published : 01 Dec 2022 01:21 IST

అహ్మదాబాద్‌: గుజరాత్ రాష్ట్రానికి 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌లు గౌరవ చిహ్నాలుగా నిలిస్తే,  21వ శతాబ్దంలో ప్రధాని మోదీ గౌరవ చిహ్నాంగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని రావణుడితో పోల్చడం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. అసభ్య పదాలు ఉపయోగిస్తున్న ఆ పార్టీకి గుజరాత్‌ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు.

‘‘మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి మహా నేతలు 20వ శతాబ్దంలో గుజరాత్‌ రాష్ట్రానికి గౌరవ చిహ్నాలుగా నిలిచారు. 21వ శతాబ్దంలో ప్రధాని మోదీ గుజరాత్‌ గౌరవ చిహ్నాంగా ఆవిర్భవించారు. కానీ, విపక్ష పార్టీ ప్రధానిపై నిరాధార ఆరోపణలు చేస్తూ, అసభ్య పదాలను ఉపయోగిస్తోంది. ప్రధాని పదవి అంటే కేవలం వ్యక్తి కాదు.. అదో వ్యవస్థ. గుజరాత్‌ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన రీతిలో సమాధానం చెబుతారు’’ అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం కోసం పోరాడుతుంటే, ఆప్‌ తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. మొత్తం 182 స్థానాల్లో మూడొంతుల స్థానాలు గెలిచి భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని రాజ్‌నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 1,5 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని