Sachin Pilot: వాళ్లు బాధ, కన్నీళ్లే ఇచ్చారు.. మళ్లీ అధికారం మాదే: సచిన్‌ పైలట్‌

రాజస్థాన్‌లో కొన్ని దశాబ్దాలుగా  భాజపా, కాంగ్రెస్‌ మధ్య అధికారం చేతులు మారుతున్న ధోరణి ఈసారి ఉండదని.. వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ పార్టీయే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సచిన్‌ పైలట్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.

Published : 24 Aug 2023 19:20 IST

జైపుర్‌: కేంద్రంలో అధికార పార్టీగా, రాష్ట్రంలో ప్రతిపక్షంగా భాజపా(BJP) విఫలమైందని రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌(Sachin Pilot) విమర్శించారు. త్వరలో జరగనున్న రాజస్థాన్‌ ఎన్నికల్లో గెలుపు మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. రాజస్థాన్‌లో కొన్ని దశాబ్దాలుగా భాజపా, కాంగ్రెస్‌ మధ్య అధికారం చేతులు మారుతున్న ధోరణి ఈసారి ఉండదని.. వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ పార్టీయే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. గురువారం అజ్మీర్‌లోని మసుదా అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014, 2019  లోక్‌సభ ఎన్నికల్లో భాజపా వరుసగా రెండుసార్లు విజయం సాధించినా.. ఓటర్లకు మాత్రం మంచి చేయలేదన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల ప్రభావం 2024 లోక్‌సభ ఎన్నికలపై ఉంటుందన్నారు. 

మోదీ సర్కార్‌ సామాన్యులకు చేసిన లబ్ధి ఏంటి?

కేంద్రంలో భాజపా ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉందని..  రెండు సార్లు పూర్తి మెజార్టీ ఇచ్చిన ప్రజల్ని మోసం చేసిందని సచిన్‌ పైలట్‌ ఆరోపించారు. అన్ని వర్గాల నుంచి ఓట్లు పొంది.. వారికి కేవలం బాధ, కన్నీళ్లు మాత్రమే ఇచ్చారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలు తీసుకొచ్చిందని.. ఆ తర్వాత రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా దాన్ని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం మాట్లాడటంలేదని ఆక్షేపించారు. కేవలం ఎన్నికలకు ముందు వచ్చి ఆలయం, మసీదు, హిందూ, ముస్లిం పేర్లతో ఓట్లు అడుగుతుంటారంటూ మండిపడ్డారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు తీసుకొచ్చిందని.. మోదీ సర్కార్‌ సామాన్యులకు చేసిన లబ్ధి ఏంటని ప్రశ్నించారు.  రాజస్థాన్‌లోని భాజపా నేతలు నిద్రపోతున్నారని.. దిల్లీ నుంచి జాతీయ నేతలు వచ్చి వాళ్లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని