Lok Sabha Polls: భాజపా కీలక సమావేశం.. ప్రచార వ్యూహాలను వివరించిన అమిత్‌ షా, నడ్డా!

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొన్న ఈ సమావేశంలో 543 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ప్రచార వ్యూహాలను చర్చించారు.

Published : 16 Jan 2024 21:18 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతున్న వేళ ప్రచార వ్యూహాలకు భాజపా (BJP) పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) పాల్గొన్న ఈ సమావేశంలో 543 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ప్రచార వ్యూహాలను చర్చించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారితో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు సమాచారం.

భాజపా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీకి చెందిన 300 మంది నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి కృషి చేసిన తీరు.. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పెరిగిన ప్రతిష్ఠ, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్లడం వంటి అంశాలను అమిత్‌ షా ప్రస్తావించినట్లు పార్టీ జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్‌డే పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించాలని నేతలకు జేపీ నడ్డా ఈ సందర్భంగా సూచించారు. 2019లో పరిమిత సంఖ్యలో సీట్లు వచ్చిన ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని స్వాగతించాలని సూచించినట్లు సమాచారం. కేవలం భాజపా విజయం సాధించడమే కాకుండా.. మిత్రపక్షాలు ఎక్కడ పోటీ చేసినా వారి గెలుపునకు కృషి చేయాలని పార్టీ నాయకులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని