Supriya Sule: ‘బంధుప్రీతి’పై సుప్రియా సూలె కీలక వ్యాఖ్యలు

‘బంధుప్రీతి లేని పార్టీ ఏదైనా ఉందా?’అని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలె వ్యాఖ్యానించారు.

Published : 12 Jun 2023 01:42 IST

దిల్లీ: ‘బంధుప్రీతి’ అంశంపై ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా ఎన్నికైన సుప్రియా సూలే (Supriya Sule) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత శరద్‌పవార్‌ (Sharad pawar) కుమార్తె అనే ఏకైక కారణంతో ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ‘బంధుప్రీతి’ లేని పార్టీ ఏదైనా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. అలాగని అందర్నీ ఒకతాటిన కట్టడం సరికాదని ఆమె అన్నారు. ‘‘ బంధుప్రీతి గురించి మాట్లాడిన వాళ్లు.. పనితీరు గురించి ఎందుకు మాట్లాడరు. నా పార్లమెంటరీ సమాచారాన్ని ఒక్కసారి పరిశీలించండి. అలాగని సభను నా తండ్రో, నా తల్లో, నా మామయ్యో నడపడం లేదు. అక్కడ బంధుప్రీతి లేదు కదా.’’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సుప్రియా సూలె సమాధానమిచ్చారు.

ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రఫుల్‌ పటేల్‌, సుప్రియా సూలేలను శనివారం ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ నియమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతలనూ సుప్రియకే అప్పగించారు. పార్టీ 24వ వార్షికోత్సవం సందర్భంగా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, గోవాతోపాటు పార్టీ రాజ్యసభ వ్యవహారాలను ప్రఫుల్‌ పటేల్‌ చూస్తారు. లోక్‌సభ, పార్టీ వ్యవహారాలతోపాటు మహిళలు, యువత, విద్యార్థి విభాగాలు, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌లకు సుప్రియ ఇన్‌ఛార్జిగా ఉంటారు. పార్టీ నిర్వహణ బాధ్యతలను సునీల్‌ తత్కారే, యోగానంద్‌ శాస్త్రి, కేకే శర్మ, మహమ్మద్‌ ఫైజల్‌, నరేంద్ర వర్మ, జితేంద్ర అవధ్‌, ఎస్‌ఆర్‌ కోహ్లిలకు అప్పగించారు. కాగా, దీనిపై రాజకీయంగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కేవలం బంధుప్రీతితోనే సుప్రియా సూలెకు కీలక బాధ్యతలు అప్పగించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని