Nara Lokesh: జగన్‌ అలా అంటే జాలి పడొద్దు: లోకేశ్‌

ఏపీ సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 13 Feb 2024 15:54 IST

పాతపట్నం: ఏపీ సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రోజుకో మోసం, పూటకో అబద్ధం అనేలా ఆయన పాలన సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ మాట్లాడారు. ఎన్నికల ముందు జగన్‌ తీయని మాటలు చెప్పారని.. అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారన్నారు. ఏటా డీఎస్సీ అని చెప్పి ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తెదేపా-జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. నిరుద్యోగులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ మధ్య జగన్‌.. మీ బిడ్డ.. మీ బిడ్డ.. అని అంటున్నారని.. ప్రజలు జాలి చూపించొద్దని సూచించారు. పొరపాటున జగన్‌ ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా.. మీ భూమి తీసుకుంటానంటారని లోకేశ్‌  ఎద్దేవా చేశారు.

‘‘రూ.కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది వైకాపాకు అంతిమయాత్రగా మారింది. డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమన్నా.. ఎవరూ పోవడం లేదు. తెదేపా హయాంలో జరిగిన నిర్మాణాలకు జగన్‌ రంగులు వేసుకుంటున్నారు. ఆయన్ను చూస్తే కోడికత్తి.. చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుంది. జగన్‌ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ. తెదేపా అధినేతను అరెస్టు చేస్తే పార్టీ కార్యకర్తలు భయపడతారని అనుకున్నారు. కేసులకు భయపడేది లేదని జగన్‌ గుర్తుంచుకోవాలి. బాంబులకే భయపడని కుటుంబం మాది.. పనికిమాలిన కేసులకు భయపడతామా?అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్‌కు సవాల్‌ చేస్తున్నా.. ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుంది.

మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ బోర్డులు పెడుతున్నారు. మీ తల్లి, సోదరే మిమ్మల్ని నమ్మడం లేదు.. మేమెలా నమ్ముతాం? ప్రాణహాని ఉందని షర్మిల, సునీత చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని జగన్‌.. రాష్ట్ర ప్రజలకు కల్పించగలరా?జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిలను బెదిరిస్తున్నారు. జగన్‌ను చూస్తే కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ గుర్తొస్తారు. ఆయనకు 2 బటన్లు ఉంటాయి. బల్లపై ఒక బ్లూ బటన్‌, బల్ల కింద ఎర్ర బటన్‌. బ్లూ బటన్‌ నొక్కితే ఖాతాలో రూ.10 పడతాయి.. ఎర్ర బటన్‌ నొక్కగానే రూ.100 పోతాయి. 9 సార్లు విద్యుత్‌, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. భవిష్యత్తులో పీల్చే గాలికీ జగన్‌ పన్ను వసూలు చేస్తారేమో’’ అని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని