Telangana news: హైకోర్టులో కాంగ్రెస్‌కు షాక్‌.. ఓయూలో రాహుల్‌ పర్యటనపై పిటిషన్ కొట్టివేత

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన

Updated : 04 May 2022 23:40 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాహుల్‌ వర్సిటీలో పర్యటించేలా వీసీని ఆదేశించాలన్న నేతల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్‌ బెంచ్‌.. ఎన్‌ఎస్‌యూఐ నేతలు వేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఓయూలో రాహుల్‌ గాంధీ ముఖాముఖికి అనుమతి నిరాకరించింది. 

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వర్సిటీ క్యాంపస్‌ను రాజకీయ వేదికగా వినియోగించరాదని పేర్కొంది. గతంలో సీఎం జన్మదిన వేడుకలు జరిగాయని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భాజపా మాక్‌ అసెంబ్లీ, జార్జిరెడ్డి జయంతి జరిగాయని తెలిపారు. గతంలో అనుమతించారన్న కారణంగా రాహుల్‌ ముఖాముఖికి అనుమతివ్వలేమని హైకోర్టు పేర్కొంది. ఓయూ పాలకమండలి తీర్మానానికి విరుద్ధంగా అనుమతివ్వలేమని స్పష్టంగా చెప్పింది. సమానత్వ హక్కు పాజిటివ్‌ అంశాలకే కానీ, నెగెటివ్‌ విషయాలకు కాదని తెలిపింది. పరీక్ష కేంద్రాలకు ఆడిటోరియం 2కి.మీ దూరం ఉందన్న వాదన యోగ్యం కాదంది. వర్సిటీలో ఏ కార్యక్రమం సరైందో కాదో రిజిస్ట్రారే సరైన నిర్ణయం తీసుకోగలరని తెలిపింది. ఓయూ రిజిస్ట్రార్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, వర్సిటీలు విద్య, శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని చెప్పింది. వర్సిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించరాదని తెలిపింది. నేతలు, కొందరి జన్మదిన వేడుకలకు అనుమతి ఇచ్చారని, కొందరికి అనుమతి వల్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలుగుతుందని పేర్కొంది. భవిష్యత్తులో రాజకీయ కార్యక్రమాలకు అనుమతించవద్దని ఈ సందర్భంగా హైకోర్టు ఓయూ రిజిస్ట్రార్‌ను హెచ్చరించింది. క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించాలని, కార్యక్రమాలపై సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా వర్సిటీలు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇతర వర్సిటీలు కూడా మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని