AP News: నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా?: బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ కొరవడిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated : 26 Sep 2021 13:35 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ కొరవడిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో సిరిమాను ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిన్న రిపబ్లిక్‌ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. ‘‘సినిమా టికెట్ల అంశంలో జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలు సరికాదు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచేస్తామంటే కుదరదు. ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్‌లైన్‌ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు. నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా?ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.

చిత్ర పరిశ్రమలో పవన్‌తో పాటు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి పెద్దలు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు అదుపులో ఉండాలి’’ అని బొత్స అన్నారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలోనూ ఆయన స్పందించారు. ‘‘మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టం. మంత్రివర్గంపై పూర్తి స్వేచ్ఛ ఉంది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే’’ అని అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని