Ts News: తెరాస,భాజపా పోటాపోటీ నినాదాలు.. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో రగడ

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ తొలి సమావేశం రసాబాసగా ముగిసింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతున్న సమయంలో భాజపా కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం..

Updated : 18 Dec 2021 17:58 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ తొలి సమావేశం రసాబాసగా ముగిసింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతున్న సమయంలో భాజపా కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భాజపా సభ్యులు మాట్లాడేందుకు మేయర్‌ అవకాశం ఇవ్వడంపై తెరాస కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా స్పందించిన భాజపా సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జై తెలంగాణ, భారత్‌ మాతాకీ జై అంటూ ఇరు పార్టీల కార్పొరేటర్లు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఆందోళన మధ్యలోనే కౌన్సిల్‌ సమావేశం ముగిసినట్టు మేయర్‌ విజయలక్ష్మి ప్రకటించారు.

కరోనా సమయంలో స్మశాన వాటికల్లో ఎంతమందిని ఖననం చేశారు?
కౌన్సిల్‌ లో మొత్తం 23 ప్రశ్నలు అడిగేందుకు అవకాశమిచ్చారు. ఎస్‌ఎన్‌డీపీపై సుదీర్ఘ చర్చ జరిగింది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో స్మశానవాటికల్లో ఎంతమందిని ఖననం చేశారు? ఎంతమందిని పూడ్చిపెట్టారు? ఎంతమందికి అంత్యక్రియలు నిర్వహించారు? వివరాలు చెప్పాలని అడిగారు. రోశయ్యకు స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. స్మశానవాటికలను కొన్నింటిని స్థానిక సంస్థలకు అప్పగించామని, అందువల్ల కచ్చితమైన మరణాల వివరాలు చెప్పలేమని కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. నగరంలోని పలు అక్రమ కట్టడాలపై కార్పొరేటర్లు సభలో చర్చించారు. జీహెచ్‌ఎంసీకి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో వివరాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ఎస్‌ఎన్‌డీపీకి సంబంధించిన పనుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.633 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలో రూ.885 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని, పనులు పురోగతిలో ఉన్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని