TS News: దేశం బంగ్లాదేశ్‌తో పోటీ పడలేకపోతోంది: హరీశ్‌రావు

గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 24 Sep 2022 17:13 IST

హైదరాబాద్‌: గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘ఆరేళ్లలో దేశం 7 శాతం వృద్ధి రేటు సాధించింది. దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాం. కేసీఆర్‌ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైంది. భాజపా హయాంలో దేశ ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది. భారత్‌ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయమే ఎక్కువ. కరోనా కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్‌ వృద్ధిరేటు సాధించింది’’ అని హరీశ్‌రావు అన్నారు.

వాస్తవాలపై కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

‘‘తలసరి ఆదాయం విషయంలోనూ రాష్ట్రం మంచి వృద్ధి సాధించింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉంది. ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం పదో స్థానంలో ఉంది. ఆరేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు రెట్టింపు అయింది. ఆరేళ్లలో దేశ తలసరి ఆదాయం 48.7 శాతం పెరిగింది. ఈ వాస్తవాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానం

‘‘సొంత పన్నుల ఆదాయంలో రాష్ట్రానిది దేశంలోనే అగ్రస్థానం. ఆరేళ్లలో రాష్ట్ర పన్నుల ఆదాయం 90 శాతం పెరిగింది. ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదు. తెరాస ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది. సొంత పన్నుల ఆదాయంలో ఏటా 11.52 శాతం వృద్ధి సాధించాం. రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేళ్లలో 120 శాతం పెరిగాయి’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని