AP News: కాకినాడ మేయర్‌పై ముగిసిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ.. ఫలితం రిజర్వ్‌

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ సుంకర పావనిపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం

Updated : 05 Oct 2021 17:09 IST

విప్‌ ధిక్కరించిన తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు

కాకినాడ నగరం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌-1 సత్తిబాబుపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ప్రొసీడింగ్‌ అధికారి, జేసీ లక్ష్మీశ ప్రకటించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని రిజర్వులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. ఎక్స్‌అఫీషియో హోదాలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 

కాకినాడలోని 50 డివిజన్లకు.. 48 చోట్ల 2017లో ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లలో ముగ్గురు మరణించగా, ఒకరు రాజీనామా చేశారు. దీంతో కార్పొరేటర్ల సంఖ్య 44కి చేరింది. వీరిలో తెదేపా-30, వైకాపా-8, భాజపా-3, స్వతంత్రులు 3 ఉన్నారు. ప్రస్తుత తెదేపా సభ్యుల్లో 21 మంది, ఇద్దరు భాజపా సభ్యులు అసమ్మతి వర్గంలో ఉన్నారు. వీరితో పాటు వైకాపా, స్వతంత్రులు కలిపి మొత్తం 33 మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌కు లేఖలు అందజేశారు. ఈ నేపథ్యంలో జేసీ లక్ష్మీశ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని