
TS News : ఉద్రిక్త పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి అరెస్టు..
హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఎర్రవెల్లిలో రచ్చబండకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేశారు. అయితే ఎర్రవెల్లి వెళ్లేందుకు ఆయన కార్యకర్తలతో కలిసి బయటకి రాగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకుని సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అయితే అప్పటికే రేవంత్ నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి నిరసనల మధ్యే రేవంత్‌ను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు నిర్బంధాలు ఎన్ని ఉన్నా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లికి వెళ్తానని.. అక్కడ రచ్చబండ నిర్వహించి తీరుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.