Sonia Gandhi: నేతల మధ్య ఐక్యత కొరవడింది : సోనియా గాంధీ!

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ పార్టీ నేతలు క్రమశిక్షణ, ఐక్యతతో మెలగాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ నేతలకు సూచించారు.

Updated : 27 Oct 2021 01:22 IST

పార్టీ నేతలతో కీలక సమావేశం

దిల్లీ: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ పార్టీ నేతలు క్రమశిక్షణ, ఐక్యతతో మెలగాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. వ్యక్తిగత అజెండాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషిచేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీలు, రాష్ట్రాల ఇంఛార్జీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పార్టీ స్థితిగతులు, సంస్థాగత ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో వచ్చే ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియాగాంధీ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి రాహుల్‌, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.

సఖ్యత కొరవడింది..

ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పార్టీ అగ్రనేతల ఆధ్వర్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుల మధ్య స్పష్టత, సఖ్యత కొరవడిందని సోనియా గాంధీ పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐకమత్యంగా పోరాటాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని పార్టీ అధినేత ఉద్ఘాటించారు. కీలక సమస్యలపై పార్టీ ఇచ్చే సందేశం కిందస్థాయి కార్యకర్తలకు సరిగా చేరడం లేదని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.

ఇక భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ దురుద్దేశపూరిత ప్రచారాలను సైద్ధాంతికంగా ఎదుర్కోవాలని సోనియాగాంధీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతీ, యువకులు తమ ఆశయాలను చాటుకునేందుకు వేచిచూస్తున్నారని.. ఈ సందర్భంగా వారికి వేదిక కల్పించాల్సిన అవసరాన్ని సోనియా గాంధీ గుర్తుచేశారు. అంతకుముందు తరాలకు కల్పించినట్లుగానే నేటి యువతకు వేదిక కల్పించడం మన కర్తవ్యమంటూ పార్టీ నేతలకు హితబోధ చేశారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టేందుకు విధివిధానాలను సిద్ధం చేసినట్లు ఆమె వివరించారు.

ఇదిలాఉంటే, వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని