Congress: భారాసతో పొత్తు ఉండదు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు పరిశీలిస్తున్నాం: మాణిక్‌రావు ఠాక్రే

రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రేతో ఎయిర్‌పోర్టు లాంజ్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్‌, బోసురాజు, వేణుగోపాల్‌ తదితరులు సమావేశమయ్యారు.

Updated : 14 Feb 2023 20:34 IST

హైదరాబాద్‌: భారాసతో పొత్తు ఉండదని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఠాక్రేతో ఎయిర్‌పోర్టు లాంజ్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్‌, బోసురాజు, వేణుగోపాల్‌ తదితరులు సమావేశమయ్యారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదు’’ అంటూ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఠాక్రేకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సర్వేలు చూసి హంగ్‌ వస్తుందని చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. ‘‘కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. వీడియోలు చూశాక మాట్లాడతా. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన విషయాలకు పార్టీ కట్టుబడి ఉంది’’ మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.

పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపాయి. ఆ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకోవాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తు ఉండదని వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురిచేసే విధంగా పొత్తుపై మాట్లాడడం సరికాదన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని