ECI: శరద్‌ పవార్‌కు షాక్‌.. అజిత్‌ వర్గమే అసలైన ఎన్సీపీ

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది.

Updated : 06 Feb 2024 20:41 IST

దిల్లీ: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP)లో నెలకొన్న వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎన్‌సీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్‌ పవార్‌ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన వర్గానికి ఒక పేరును ఎంచుకోవాలని శరద్ పవార్‌కు ఈసీ సూచించింది. ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 3 గంటల లోపు తమ వర్గం పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని గడువు ఇచ్చింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈసీ నిర్ణయంతో శరద్‌పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా- శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అప్పటి నుంచి అసలైన ఎన్సీపీ ఎవరిదనే దానిపై శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ మధ్య వివాదం కొనసాగుతోంది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని