PM Modi: అణ్వాయుధాలను వ్యతిరేకించేవారు దేశాన్ని రక్షించలేరు - మోదీ

విపక్షాల కూటమిలో కొందరు అణు నిరాయుధీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని.. అటువంటి వారు దేశాన్ని రక్షించలేరని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 14 Apr 2024 17:48 IST

భోపాల్‌: విపక్ష కూటమి (INDIA) చేస్తున్న ప్రకటనలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అందులో కొందరు అణు నిరాయుధీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని.. అటువంటి వారు దేశాన్ని రక్షించలేరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన.. రాహుల్‌ గాంధీ మాటలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.

‘‘విపక్షాల కూటమిలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు ప్రమాదకరమైన హామీలు గుప్పించాయి. అందులో ఒకటి అణు నిరాయుధీకరణ చేస్తామని చెప్పడం. శత్రుదేశాలు ఎంతో అణ్వాయుధ శక్తి కలిగిన నేటి ప్రపంచంలో అవి లేకుండా ఎలా? మన దేశాన్ని రక్షించుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే. వద్దని చెప్పేవారు దేశాన్ని ఎలా రక్షిస్తారు? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. సీపీఎంను ఉద్దేశిస్తూ పీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

అందుకే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయ్‌: అమర్త్య సేన్‌

ఒకే దెబ్బతో పేదరికాన్ని తొలగిస్తానంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పడంపైనా ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. అటువంటి ప్రకటనలతో ప్రజలు నవ్వుకుంటారని, ఏదేమైనా రాహుల్‌ మాటలను దేశ ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. గరీబీ హఠావో పేరుతో అప్పట్లో (ఇందిరా గాంధీ) ఇచ్చిన హామీ గురించి ప్రజలకు తెలుసునంటూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఎప్పుడూ అవమానపరిచేదని.. భాజపా మాత్రం ఆయన్ను గౌరవించిందని మోదీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగం వల్లే నేడు ఓ గిరిజన కుటుంబానికి చెందిన మహిళ రాష్ట్రపతి అయ్యారని అన్నారు. ‘మోదీకి ఎటువంటి కలలు లేవు, మీ స్వప్నాలే నా లక్ష్యం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని