NCP Crisis: అధికార దాహంతోనే భాజపా చెంతకు : శరద్‌ పవార్‌

పార్టీ (NCP) నుంచి కొందరు వెళ్లిపోయినప్పటికీ దాన్ని మళ్లీ నిర్మించుకుంటానని.. పార్టీ గుర్తు ఎక్కడికీ పోదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) పేర్కొన్నారు.

Published : 05 Jul 2023 18:03 IST

ముంబయి: ఎనభైఏళ్లకు పైబడినా ఇంకా పార్టీ పగ్గాలు తన వద్దే ఉంచుకున్నారంటూ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ (Ajit Pawar) చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై స్పందించారు. ఎన్సీపీని అవినీతి పార్టీ అని మోదీ పేర్కొంటున్నప్పటికీ.. అధికారం కోసమే అజిత్‌ పవార్‌ భాజపాతో చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. తన మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన ఆయన (Sharad Pawar).. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినప్పటికీ దాన్ని మళ్లీ నిర్మించుకుంటానన్నారు. ఇక తమదే అసలైన పార్టీ అంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంపై మాట్లాడిన పవార్‌.. పార్టీ గుర్తు ఎక్కడికీ పోదన్నారు. తిరుగుబాటు చేసిన నేతలు తన ఫొటోను ఉపయోగించుకోవడంపై శరద్‌ పవార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ఇన్నేళ్లలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదంటూ కొన్నిరోజుల క్రితమే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను వారు (అజిత్‌ పవార్‌) అవహేళన చేశారు. ఈరోజు వారితోనే చేతులు కలిపారు. తన మనసులో ఏదైనా ఉంటే అజిత్‌ తమతో చర్చించాల్సి ఉండేది. వేరే మార్గాన్ని ఎంచుకోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నా. వాళ్లను వెళ్లనివ్వండి. పార్టీని మళ్లీ పునర్‌నిర్మిస్తా. పార్టీ గుర్తు తమతోనే ఉంటుంది. ఎక్కడికీ పోదు. పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రజలు, కార్యకర్తలు తమతోనే ఉన్నారు. తిరుగుబాటు నేతలు ఇంకా నా ఫొటో ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. మాకు అధికారదాహం లేదు. కేవలం ప్రజల కోసం పనిచేస్తాం’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

ఇక భాజపాపై మండిపడ్డ శరద్‌ పవార్‌.. ఎన్సీపీని అవినీతి పార్టీ అని పేర్కొన్న కాషాయ పార్టీ, ఇప్పుడెందుకు వీరితో పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు ఏం జరిగిందో ఇప్పుడదే పునరావృతమవుతోందన్నారు. ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోని వారి చేతుల్లోనే దేశం ఉందన్న శరద్‌ పవార్‌.. భాజపాను విశ్వసించే పరిస్థితి లేదన్నారు.

36 మంది మద్దతు ఉంటేనే..

ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్‌ పవార్‌  ఏర్పాటు చేసిన సమావేశానికి 29మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శరద్‌ పవార్‌ సమావేశానికి మాత్రం కేవలం 14మంది మాత్రమే హాజరై మద్దతు తెలిపారు. మరో పది మంది మాత్రం ఇరువర్గాల సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఫిరాయింపుల చట్టం నుంచి బయటపడాలంటే అజిత్‌కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సమావేశానికి 29 మంది వచ్చినప్పటికీ తనకు మాత్రం 40మందికిపైగా ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుందని అజిత్‌ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని