TMC-BJP: ప్రకటనలో పొరపాటు.. తృణమూల్‌- భాజపా సిగపట్లు!

ఉప్పూనిప్పుగా ఉండే తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. యూపీ ప్రభుత్వం పేరిట వచ్చిన ఓ ప్రకటన అందుకు కారణమైంది.

Published : 13 Sep 2021 01:27 IST

కోల్‌కతా: ఉప్పూనిప్పుగా ఉండే తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. యూపీ ప్రభుత్వం పేరిట వచ్చిన ఓ ప్రకటన అందుకు కారణమైంది. కోల్‌కతాలోని ఓ ఫ్లైఓవర్‌.. యూపీ ప్రభుత్వ ప్రకటనలో కనిపించడంతో ఈ రచ్చకు దారి తీసింది. దీంతో రెండు పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు.

యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని యూపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం పేరిట ఓ ప్రకటన వచ్చింది. నాలుగున్నరేళ్ల యోగి హయాంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయనేది దాని సారాంశం. అయితే, అందులో యోగి ఆదిత్యనాథ్‌ చిత్రంతో పాటు ఓ ఫ్లైఓవర్‌, ఆ పక్కనే ఓ భవనాన్ని ముద్రించారు. అందులోని ఫ్లైఓవర్‌ కోల్‌కతాలోనిది అని తేలింది. దీంతో ఆ ప్రకటనను ప్రచురించిన ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ మార్కెటింగ్‌ శాఖ పొరపాటుగా పేర్కొంటూ డిజిటల్‌ మాధ్యమాల్లో తొలగిస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

ఇదే అదునుగా భావించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఫ్లైఓవర్‌ను, భవనాన్ని తస్కరించారు గానీ, పసుపు రంగు కారును అలాగే వదిలేశారంటూ వ్యంగ్య బాణాలు సంధించింది. బెంగాల్‌లో జరిగిన అభివృద్ధిని యోగి ఆదిత్యనాథ్‌ తమదిగా చెప్పుకుంటున్నారంటూ టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ట్వీట్‌ చేశారు. ఇదేనా డబుల్‌ ఇంజిన్‌ మోడల్‌ అంటూ ఎద్దేవాచేశారు. పార్టీని రక్షించుకోవడం కోసం సీఎంలను మార్చడం తప్ప ఆ పార్టీకి ఇంకేమీ తెలీదని ఆ పార్టీ సీనియర్‌ నేత ముకుల్‌రాయ్‌ విమర్శించారు. అయితే, యోగి ప్రభుత్వంలో ఎన్నో ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగినా పశ్చిమ బెంగాల్లోలాగా కూలిపోలేదని భాజపా పశ్చిమ బెంగాల్‌ యూనిట్‌ విమర్శించింది. ప్రకటనలో తప్పు దొర్లినంత మాత్రాన ఆదిత్యనాథ్‌ హయాంలో జరిగిన అభివృద్ధి ఘనత ఏమీ చెరిగిపోదని ఆ పార్టీ నేత సయంతన్‌ బసు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని