యోగీ ఆదిత్యనాథ్‌: కోటిన్నర ఆస్తులు.. ఓ రివాల్వర్‌, ఓ రైఫిల్‌, శాంసంగ్‌ ఫోన్‌!

రూ.12వేల విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, రూ.లక్ష విలువగల రివాల్వర్‌, రూ.80వేల విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు యోగీ ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.

Updated : 04 Feb 2022 19:56 IST

ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలు వెల్లడించిన యూపీ సీఎం

లఖ్‌నవూ: గతంలో లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తాజాగా గోరఖ్‌పుర్‌ శాసనసభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తులు, ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయనకు కోటిన్నర విలువైన ఆస్తులు (రూ.1,54,94,054) ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు రూ.12వేల విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, రూ.లక్ష విలువగల రివాల్వర్‌, రూ.80వేల విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు యోగీ ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.

రూ.49వేల విలువగల బంగారు చెవి రింగు, రూ.20వేల విలువ కలిగిన రుద్రాక్షహారం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవు. సొంత వాహనం లేదు. ఎటువంటి రుణాలూ లేవు. పెండింగ్‌లోనూ ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. వీటితోపాటు గత నాలుగేళ్లలో ఆయన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్‌లో పొందుపరిచారు.

అఖిలేష్‌ ఆస్తులు రూ.17.2 కోట్లు

సమాజ్‌వాదీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకోసం మైన్‌పురిలోని కర్‌హల్‌ స్థానం నుంచి ఇటీవలే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో తనకు రూ.17.22 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 శాసనసభ స్థానాలకు గాను ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 7న చివరి దశతో పోలింగ్‌ ముగుస్తుంది. యోగీ ఆదిత్యనాథ్ పోటీ చేస్తోన్న గోరఖ్‌పుర్‌ శాసనసభ స్థానానికి మార్చి 3న ఎన్నిక జరుగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని