Himachal Pradesh election:గెలిచాం సరే..మరీ ఓపీఎస్‌ అమలు ఎలా?

హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh )లో పాత పింఛన్‌ పథకాన్ని పునరుద్ధరించడం కొత్త ఏర్పడిన కాంగ్రెస్‌(Congress ) ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. 

Updated : 08 Dec 2022 17:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కింది. అక్కడ వారికి అధికారం కట్టబెట్టడంలో ‘పాత పింఛన్‌ పథకం(ఓపిఎస్‌) పునరుద్ధరణ’ హామీ కీలకంగా పనిచేసింది. ఆ రాష్ట్రంలో దాదాపు 2.5లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. వారిలో 1.5లక్షల మంది కొత్త పింఛన్‌ పథకం కింద ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి  ప్రయోజనం కల్పించే ఈ హామీ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపింది. వాస్తవానికి ఇప్పటికే కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టడం హిమాచల్‌లో కలిసి వచ్చింది. ఈ సారి గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో కూడా  పాత పింఛన్‌ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ హమీ ఇచ్చింది. గుజరాత్‌లో భారీ ఓటమి నుంచి ఈ హామీ పార్టీని రక్షించలేకపోయింది. కానీ, హిమాచల్‌లో మాత్రం అధికారపగ్గాలను అందించింది. వాస్తవానికి హిమాచల్‌ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ పథకం అమలు కొత్త ప్రభుత్వానికి కఠిన సవాళ్లతో కూడుకొన్న విషయమని అర్థమవుతుంది. 

ఆర్థిక వనరులు కటకటా..

31 మార్చి 2021 నాటి స్టేట్‌ ఫైనాన్స్ ఆడిట్‌ రిపోర్టు మేరకు హిమాచల్‌ ప్రభుత్వం కచ్చితంగా చేయాల్సిన వ్యయాలు రూ.22,464 కోట్లుగా ఉన్నాయి. 2016-17లో ఇవి కేవలం రూ.17,154 కోట్లు మాత్రమే. ఈ వ్యయాల్లో వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఈ వ్యయాలు రాష్ట్రం మొత్తం ఖర్చులో 65.31శాతం నుంచి 67.19శాతానికి పెరిగాయి. ఇటువంటి ఖర్చులు పెరిగాయంటే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గుతాయని అర్థం. 2020-21 లెక్కల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యయంలో కేవలం మూడో వంతు మాత్రమే అభివృద్ధికి కేటాయించే పరిస్థితి నెలకొంది. 

* 2020-21 నాటికి రూ.6,088 కోట్లు పింఛన్‌పై వెచ్చించారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ వ్యయం 50శాతం పెరిగినట్లు లెక్క. ఇక ఆదాయ వనరుల్లో పింఛన్‌ వ్యయం వాటా 2016-17లో 15.66 శాతం నుంచి 2020-21 నాటికి 18.21శాతానికి చేరింది.

* 2020-21 నాటికి హిమాచల్‌ ప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చే సొమ్ము.. మొత్తం ఆదాయంలో నాలుగో వంతు మాత్రమే  ఉంది. అదే జాతీయ స్థాయిలో రాష్ట్రాల మొత్తం ఆదాయాల్లో  స్థానిక పన్నుల రాబడి శాతం సగటు 38.04గా ఉంది. దీనిని చూసే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనావేయచ్చు. హిమాచల్‌ రాష్ట్ర వృద్ధికి తగ్గట్లు ఆదాయం మాత్రం లేదు. 2021 లెక్కల ప్రకారం ఆ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ను అమలు చేయడం కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు