YS Bhaskar Reddy: మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం: ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka Murder Case)పై విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని సీబీఐ(CBI) అధికారులు చెప్పినట్లు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy) తెలిపారు. విచారణ కోసం ఆదివారం వచ్చిన ఆయన.. సీబీఐ అధికారులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. 

Updated : 12 Mar 2023 13:31 IST

కడప (నేరవార్తలు): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka Murder Case)పై సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy) తెలిపారు. 12న విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహం వద్దకు ఆదివారం వచ్చారు. అక్కడ సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. 

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డితో పాటు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటామంటూ సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాము దేనికైనా సిద్ధమని భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఏడాది కిందట వరుసగా రెండు రోజులపాటు పులివెందులలో విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి విచారణకు పిలిచింది. మరోవైపు భాస్కర్‌రెడ్డి రాకతో కడప జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు