YS Sharmila: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated : 04 Jan 2024 12:51 IST

దిల్లీ: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న ఆమె.. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వైతెపాను హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది. 

ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తా: షర్మిల

వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌లో వైతెపా ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌ తన జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌. కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైతెపా పోటీ చేయలేదు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషిచేస్తా’’ అని షర్మిల అన్నారు.

కాంగ్రెస్‌లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని