YS Sharmila: వైకాపా.. అభివృద్ధిని పక్కనపెట్టి భాజపా జపం చేస్తోంది: వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 23 Jan 2024 20:03 IST

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు.

‘‘ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్చిపోయారు. హోదా ప్రస్తావన తీసుకొస్తే జైల్లో పెట్టించారు. ఇక సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక స్వలాభం చూసుకున్నారే కానీ.. ఈ ఐదేళ్లలో హోదాపై ఉద్యమం చేసింది లేదు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు.. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి?

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణించా. మద్య నిషేధం అన్నారు.. ఇప్పుడేమో ఎక్కడ చూసినా మద్యం లభిస్తోందని పలువురు మహిళలు చెప్పింది విన్నాక బాధేసింది. మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నారు. మరి ఎక్కడికి పోయింది సీఎం జగన్‌ ఇచ్చిన హామీ? పోలవరం ప్రాజెక్టును వదిలేశారు. అభివృద్ధిని పక్కనపెట్టిన వైకాపా, తెదేపా.. భాజపా జపం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు భాజపాకు బానిసలుగా మారాయి’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని