సమస్యలను సమష్టిగా ఎదుర్కోవాలి

కామన్వెల్త్‌కు భారత ప్రజాస్వామ్యంలో అనేక ఉదాహరణలు ఉన్నాయని.. కొవిడ్‌ అనంతర సమస్యలు, వాతావరణ మార్పు, అంతర్జాతీయ వివాదాల్లాంటి సమస్యలను అన్ని దేశాలూ కలిసి ఎదుర్కోవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

Published : 24 Jun 2022 06:03 IST

 కామన్వెల్త్‌ దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో జైశంకర్‌

కిగాలిలో నేడు, రేపు చోగం సదస్సు

కిగాలి (రువాండా): కామన్వెల్త్‌కు భారత ప్రజాస్వామ్యంలో అనేక ఉదాహరణలు ఉన్నాయని.. కొవిడ్‌ అనంతర సమస్యలు, వాతావరణ మార్పు, అంతర్జాతీయ వివాదాల్లాంటి సమస్యలను అన్ని దేశాలూ కలిసి ఎదుర్కోవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. కామన్వెల్త్‌ ప్రభుత్వాల అధినేతల సమావేశం (చోగం)లో భాగంగా రువాండా రాజధాని కిగాలిలో గురువారం జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శుక్ర, శనివారాల్లో జరిగే చోగం సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ తరఫున జైశంకర్‌ హాజరవుతారు. కొవిడ్‌ కారణంగా చోగం సదస్సు ఇంతకుముందు రెండుసార్లు వాయిదాపడింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, కెనడా, టాంజానియా, రువాండా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, బ్రునై, తువాలు, సింగపూర్‌, బహమాస్‌, గయానా తదితర దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్‌ గురువారం విడివిడిగా భేటీ అయ్యారు. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కామన్వెల్త్‌, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌ లాంటి పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అంతకుముందు ఆయన రువాండా విదేశాంగ మంత్రి విన్సెంట్‌ బురుటాతో కలిసి కామన్వెల్త్‌ సదస్సు ఎజెండా గురించి మాట్లాడారు. కెన్యా విదేశాంగ మంత్రి, తన స్నేహితురాలు రేషెల్‌ ఒమామోను కలవడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆహారం, ఇంధనం, ఎరువులు, అంతర్జాతీయ భద్రత లాంటి అంశాల మీద ఉక్రెయిన్‌ సంక్షోభం చూపే ప్రభావంపై చర్చించామని ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ మహమ్మారిపై పోరాటానికి టీకాలు అందించడాన్ని భారత్‌ కొనసాగిస్తుందన్నారు.

కామన్వెల్త్‌కు భారత సహకారం

‘సమష్టి భవిష్యత్తు అందించడం: అనుసంధానం, ఆవిష్కరణ, సమూల మార్పు’ అనేది 26వ చోగం సదస్సు ఇతివృత్తం. ఈ సదస్సులో కామన్వెల్త్‌ సభ్యదేశాల అధినేతలు వాతావరణ మార్పు, ఆహార భద్రత, ఆరోగ్య సమస్యల్లాంటి అంతర్జాతీయ సవాళ్లపై ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని