డిజిటల్‌ వేదికగా ఎన్నికల సమరం..అయిదు రాష్ట్రాల్లో ‘వర్చువల్‌’ సందడి

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ప్రచార శైలిని కొవిడ్‌ మార్చేస్తోంది.

Updated : 19 Jan 2022 10:54 IST

 ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్‌లలో ప్రచార హోరు..

దిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ప్రచార శైలిని కొవిడ్‌ మార్చేస్తోంది. ఒమిక్రాన్‌ ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 22 వరకు బహిరంగ సభలు, రోడ్‌ షోలు, ఊరేగింపులను నిషేధించింది. దీంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి డిజిటల్, ఆన్‌లైన్‌ వేదికలను, ప్రచార గీతాలను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్‌లలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గేయ రచయితలు, కళాకారులు, సినీ నటులు ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎంపీలు, భోజ్‌ పురీ నటులైన రవి కిషన్, మనోజ్‌ తివారీల ప్రచార సందడి జోరందుకుంది. యూపీ ఎన్నికలకు శ్రీలంక హిట్‌ పాట బాణీలో భాజపా ప్రచార గీతం రూపొందింది. కాంగ్రెస్, సమాజ్‌ వాదీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలూ తమ తమ ప్రచార గీతాలను సంధించాయి. భాజపా హిందుత్వను, యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో సాధించిన అభివృద్ధిని కీర్తించే గీతాలను ప్రచారంలో పెట్టగా, సమాజ్‌వాదీ పార్టీ సామ్యవాద సిద్ధాంతాలను శ్లాఘించే పాటలతో ముందుకెళుతోంది. కాంగ్రెస్‌ పార్టీ మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలో భాగస్వాములను చేస్తానంటూ ప్రచార గీతాలతో సందడి చేస్తోంది. యూపీలో మొత్తం 402 సీట్లకు పోటీచేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తానని హామీ ఇచ్చే గీతాలతో బరిలోకి దిగింది. ప్రతి నియోజకవర్గానికి 20 బృందాల చొప్పున ఏర్పాటు చేసి వాట్సప్, ట్విటర్, ఇన్‌ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ల ద్వారా పార్టీ సందేశాలను ప్రచారంలో పెడుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి చన్నీని గంభీర ప్రకటనల మంత్రిగా చిత్రిస్తూ ఆప్‌ అనేక కొంటె చిత్రాలను (కార్టూన్లను) ప్రచారంలో పెట్టగా, ఆప్‌ నేత కేజ్రీవాల్‌ను ప్రచార కండూతి గల నేతగా చిత్రిస్తూ కాంగెస్‌ వ్యంగ్య చిత్రాలను విడుదల చేసింది.     

ఉత్తరాఖండ్‌లో పింఛన్‌ అస్త్రం
సాయుధ దళాలకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్‌ విధానాన్ని వర్తింపజేయడంలో భాజపా విఫలమైందంటూ ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఈ ప్రచారం అసత్యమంటూ భాజపా సొంత వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో పింఛన్‌ అందుకుని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న మాజీ సైనికోద్యోగులను చిత్రించింది. గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీ చిహ్నమైన రెండు పుష్పాల గుర్తు చుట్టూ ప్రచార గీతాలను రూపొందించి ఊరూవాడా వినిపిస్తోంది.

వర్చువల్‌ ప్రచారానికి లెక్క చెప్పాల్సిందే
ఈ డిజిటల్, వర్చువల్‌ ప్రచార పర్వానికి అయిన ఖర్చు గురించి రాజకీయ పార్టీలు పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికోసం అభ్యర్థుల ఎన్నికల రిటర్నులలో ప్రత్యేక కాలమ్‌ను పొందుపరిచింది. గతంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు డిజిటల్‌ ప్రచార ఖర్చును కూడా రిటర్నులలో చూపినా, ఈ సారి దానికోసం ప్రత్యేకంగా ఒక కాలమ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. నిర్దేశిత గడువులోగా తమ ఎన్నికల వ్యయాన్ని వెల్లడించని అభ్యర్థులను మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల సంఘానికి ఇస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని