Cricket News: ఆ సకారియా వేరు.. 24 గంటల్లోనే బీసీసీఐ యూ టర్న్‌.. ‘సంజు శాంసన్‌ను కెప్టెన్‌గా తప్పించాలి’

చేతన్ సకారియాను అనుమానిత బౌలింగ్‌ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చిన బీసీసీఐ (BCCI) యూ టర్న్ తీసుకుంది.

Published : 16 Dec 2023 23:05 IST

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ టీమ్ఇండియా యువ పేసర్ చేతన్ సకారియా (Chetan Sakariya)ను అనుమానిత బౌలింగ్‌ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, 24 గంటలు కూడా ముగియకముందే ఈ విషయంలో బీసీసీఐ (BCCI) యూ టర్న్ తీసుకుంది. అనుమానిత బౌలింగ్ యాక్షన్‌ కలిగిన బౌలర్ల జాబితాలో చేతన్‌ సకారియా లేడని, సమాచారం లోపం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. కర్ణాటకకు చెందిన చేతన్‌ అనే పేరుగల బౌలర్‌ ఈ జాబితాలో ఉండాల్సిందని, పొరపాటున అతని పేరుకు బదులు చేతన్‌ సకారియా పేరు వచ్చిందని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయదేవ్ షా పేర్కొన్నారు.  ‘‘సమాచార లోపం వల్ల ఇలా జరిగింది. అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన జాబితాలో చేతన్‌ సకారియా లేడు. ఆ జాబితాలో కర్ణాటక బౌలర్ పేరు ఉండాలి. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలియజేశాం’’ అని జయదేవ్ షా వివరించారు. 

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో చేతన్‌ సకారియా దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడాడు. అనంతరం అతడిని దిల్లీ ఫ్రాంఛైజీ రిలీజ్ చేసింది. డిసెంబరు 19న దుబాయ్‌ వేదికగా జరగనున్న మినీ వేలంలో సకారియా ధర రూ.50 లక్షలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 2021 ఐపీఎల్ సీజన్‌లో సకారియా రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించి 14 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకుని ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు.


IPL 2024: సంజు శాంసన్‌ను కెప్టెన్‌గా తప్పించాలి

సంజు శాంసన్‌ (Sanju Samson)ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals)కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ సూచించాడు. రాజస్థాన్‌ సారథ్య బాధ్యతలను జోస్‌ బట్లర్‌ వంటి ఆటగాడికి అప్పగించాలన్నాడు. శాంసన్ నాయకత్వంలో 2022 సీజన్‌లో ఫైనల్‌కు చేరిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు కూడా రాలేదు. 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. “రాజస్థాన్ రాయల్స్ తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. నేను రాజస్థాన్ రాయల్స్‌కు ఆడినప్పుడు మేనేజ్‌మెంట్ అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేది. రాహుల్ ద్రవిడ్ భాయ్‌ కెప్టెన్. సారథిగా జట్టును ఎలా ముందుకు నడిపించాలనే దానిపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండేది. ఇప్పుడు ఆ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు కెప్టెన్సీని చాలా సీరియస్‌గా తీసుకోవాలి లేదంటే జోస్ బట్లర్‌ని కెప్టెన్‌గా చేయాలి. బట్లర్‌ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. అతడు జట్టును సమర్థంగా ముందుకు నడిపించగలడు. లేదంటే నిలకడగా ఆడుతున్న ఆటగాడి వైపు ఫ్రాంఛైజీ చూడాలి. రోహిత్ శర్మ లాంటి నాయకుడు ఆ జట్టుకు అవసరం’’ అని శ్రీశాంత్ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని