IPL 2023: కుడి నుంచి ఎడమకు మారా.. అన్నయ్య వల్లే ఇక్కడికి రాగలిగా: వివ్రాంత్‌

త్యాగంతో వచ్చిన అవకాశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు. మరీ ముఖ్యంగా కుటుంబం కోసం తనకిష్టమైన క్రికెట్‌ను వదిలేసి మరీ తమ్ముడిని ప్రోత్సహించిన అన్నయ్య నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా యువ ఆటగాడు ఐపీఎల్‌ మినీ వేలంలో మంచి ధరను సొంతం చేసుకొన్నాడు. 

Published : 24 Dec 2022 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోదరుడు విక్రాంత్‌ త్యాగానికి వివ్రాంత్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో వివ్రాంత్‌ను రూ.2.6 కోట్లతో హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన వివ్రాంత్‌ తన సోదరుడి వల్లే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జెర్సీ ధరించబోతున్నానని వెల్లడించాడు. బ్యాటర్‌, బౌలర్‌, ఓపెనర్‌, ఆల్‌రౌండర్‌ వివ్రాంత్‌ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.. 

వివ్రాంత్‌ సోదరుడు 26 ఏళ్ల విక్రాంత్‌ యూనివర్సిటీ లెవల్‌లో పేస్‌ బౌలర్‌. రంజీ ట్రోఫీలో ఆడాలని చిన్నప్పటి నుంచి అతడి కల. వ్యాపారవేత్త అయిన వీరి తండ్రి సుశాంత్ తండ్రి కొన్నేళ్ల క్రితం కిడ్నీ వ్యాధితో చనిపోయారు. దీంతో కుటుంబ, వ్యాపార బాధ్యతలను విక్రాంత్‌ చేపట్టాల్సి వచ్చింది. అయితే సోదరుడి ప్రోత్సాహంతో క్రికెట్‌లో మెలకువలు నేర్చుకొని వివ్రాంత్ కెరీర్‌ను కొనసాగించాడు. లెఫ్ట్‌ హ్యాండర్‌గా మారాడు. గతేడాది ఐపీఎల్‌లో వివ్రాంత్‌ హైదరాబాద్‌ జట్టులో నెట్‌ బౌలర్‌గా ఉన్నాడు. కోల్‌కతా జట్టుతో కలిసి ట్రయల్స్‌ ఆడాడు. కానీ, సీజన్‌ పూర్తయ్యే సరికి ఇరుజట్లలో దేన్నీ ఆకట్టుకోలేకపోయాడు.

‘‘ఒక దశలో నా క్రికెట్‌ జర్నీ ఆగిపోయేది. విక్రాంత్‌ కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టడం వల్ల నేను క్రికెట్‌ను కొనసాగిస్తున్నా. ఇదంతా అన్నయ్య త్యాగం వల్లే సాధ్యపడింది. తన కలలను నా ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. ఆయన లేకపోతే నేను లేను. చదువులో నేనేం గొప్ప విద్యార్థిని కాదు. విక్రాంత్‌ భరోసాతోనే నేను క్రికెట్‌పై ధ్యాస పెట్టగలుగుతున్నా’’ అని చెబుతూ వివ్రాంత్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. వివ్రాంత్‌ చిన్ననాటి నుంచి యువరాజ్‌సింగ్‌కు వీరాభిమాని. వివ్రాంత్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి ఇర్ఫాన్‌ పఠాన్‌. ఎందుకంటే అతడూ ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌. వెస్టిండీస్‌ ఆటగాడు, హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ బ్రెయిన్‌ లారా నేతృత్వంలో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నట్టు వివ్రాంత్‌ తెలిపాడు. 

తండ్రి మరణించిన రెండేళ్లకు వివ్రాంత్ జమ్ము-కశ్మీర్‌ టీమ్‌లోకి అడుగు పెట్టాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌పై 154 బంతుల్లో 124 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌ చరిత్రలోనే జమ్ము కశ్మీర్‌కు తొలి నాకౌట్‌ బెర్తును అందించిన ఇన్నింగ్స్ అది. ఆ టోర్నీలో 56.42 సగటుతో జట్టులోనే అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సయ్యద్‌ ముస్తాఫ్‌ అలీ ట్రోఫీలోనూ రెండు అర్ధ శతకాలు చేసి 145.45 స్ట్రెక్‌ రేట్‌తో 128 పరుగులు సాధించాడు. మరోవైపు ఆరు వికెట్లు తీసి 4.80 ఎకానమీతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని