Ashwin: వన్డే వరల్డ్‌ కప్‌ 2023.. ఇదేమీ రాకెట్‌ సైన్స్‌ కాదు.. పరిస్థితులు తెలుసుంటే చాలు: అశ్విన్‌

వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) భారత వేదికగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఇప్పటికే మ్యాచ్‌ల సమయాన్ని కాస్త ముందుకు జరిపితే బాగుంటుందనే సూచనలు చేశాడు. తాజాగా టీమ్‌ఇండియా (Team India) విజేతగా నిలుస్తుందా..? లేదా..? అనే విషయంపైనా స్పందించాడు.

Published : 21 Jan 2023 16:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు పుష్కర కాలం (2011)  కిందట భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. ఇక ఆతర్వాత రెండు సార్లు జరిగినా.. కప్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సిద్ధమవుతోంది. దీంతో టీమ్‌ఇండియాపై అంచనాలు పెరిగాయి. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం అంత సులువైన విషయం కాదని ప్రత్యర్థులకూ తెలుసు. అయితే, సరైన టీమ్‌ను ఎంపిక చేసి ఆడించడమే బీసీసీఐ ఎదుట ఉన్న ప్రధాన సవాల్‌. రోహిత్ నాయకత్వంలో ఆడబోయే వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజేతగా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సన్నాహకాలపై సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ స్పందించాడు. సన్నద్ధతలో భాగంగా ఒక విషయం ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. భారత్‌లోని వేర్వేరు మైదానాల్లో ఆడాల్సి ఉండటంతో.. అక్కడి పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలని సూచించాడు.

‘‘2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత నుంచి భారత్‌ వేదికగా జరిగిన మ్యాచుల్లో అత్యధిక విజయాలు సాధించాం. ఇక్కడకు వచ్చిన ప్రతి దేశంపైనా ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకొంది. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. ఇలా ద్వైపాక్షిక సిరీసుల్లో భారత్‌ 14-4 ఆధిక్యంతో కొనసాగుతోంది. దాదాపు 14 వేర్వేరు వేదికల్లో 18 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 80 శాతం వరకు విజయం సాధించాం. అదే ఆసీస్, ఇంగ్లాండ్‌ జట్లతో పోలిస్తే.. అక్కడ వారు కేవలం నాలుగైదు వేదికల్లోనే టెస్టులు, 2 లేదా 3 మైదానాల్లోనే వన్డేలు ఆడారు’’

స్వదేశంలో మైదానాలు వన్డే ప్రపంచకప్‌ను నెగ్గేందుకు భారత్‌కు అవకాశాలు ఉంటాయా..? అనే ప్రశ్నకు అశ్విన్‌ సమాధానం ఇచ్చాడు. ‘‘2011 వరల్డ్‌ కప్‌ నుంచి ఉదాహరణగా తీసుకొంటే.. స్వదేశంలో ఆడిన జట్టు కప్‌ను నిలబెట్టుకొంది. 2011లో భారత్‌, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్‌ టైటిల్‌ను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. కాబట్టి.. ఇక్కడేమీ రాకెట్‌ సైన్స్‌ సూత్రాలు ఏమీ లేవు.  పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైతేనేమీ టీమ్‌ఇండియా ఇక్కడ చాలా వేదికల్లో మ్యాచ్‌లను ఆడింది’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని